![IAS Academy for tribal youth](/styles/webp/s3/article_images/2017/09/25/3.jpg.webp?itok=suekXVGe)
సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను సివిల్ సర్వీసెస్ వైపు మళ్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ రూపొందించింది. సివిల్స్ సాధించాలనుకునే యువతకు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అకాడమీని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ఏర్పాట్లు సైతం దాదాపు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఈ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి రూ. 1.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ అకాడమీలో 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఇందులో 50 మంది మహిళలు, 100 మంది పురుషులకు సీట్లు ఇవ్వనున్నారు.
ప్రైవేటుకు చెక్...
సివిల్స్‌కు సన్నద్ధమయ్యే గిరిజన యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు గతంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం ఆశ్రయించింది. ఆయా కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులను అంతంత మాత్రంగా ఏర్పాటు చేయడంతో ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. 2016–17 విద్యా సంవత్సరంలో దాదాపు రూ.1.35 కోట్లు ఖర్చు చేసి, వందకుపైగా అభ్యర్థులను ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేర్చారు. అందులో కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు స్వస్తి పలుకుతూ సొంతంగా అకాడమీని ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ భావించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. నిధులు విడుదల చేసింది. దీంతో రాజేంద్రనగర్‌లోని వైటీసీ భవనాన్ని అకాడమీగా మార్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ భవనంలో 35 విశాల గదులతో పాటు మరో 25 గదులున్నాయి. శిక్షణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు ఇక్కడే వసతి కల్పించనుంది. ఫ్యాకల్టీగా ప్రఖ్యాత ప్రొఫెసర్లను తీసుకురానుంది. సబ్జెక్టు నిపుణులను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి రెండు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీసుకురానుంది. నిర్ణీత వ్యవధిలో సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు అడ్మిషన్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ బాధ్యతలు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది.
కార్పొరేట్ స్థాయిలో...
రాజేంద్రనగర్‌లోని వైటీసీలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీని కార్పొరేట్ స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖ తీర్చిదిద్దుతోంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డార్మిటరీలు, 2 వేల పుస్తకాల సామర్థ్యం ఉన్న లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్, బయోమెట్రిక్ మెషీన్లతో హాజరు తదితరాలు ఏర్పాటు చేస్తోంది. అకాడమీలో భద్రత కోసం సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేసింది. అన్ని రకాల దినపత్రికలు, జర్నల్స్‌ను అభ్యర్థుల కోసం అందుబాటులోకి తేనుంది.
అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం
‘గిరిజన ఐఏఎస్ అకాడమీని అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశాం. అకాడమీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించనున్నారు. ప్రైవేట్ అకాడమీలకు దీటుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యుత్తమ అధ్యాపకులను తీసుకొచ్చి అభ్యర్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాం. అకాడమీలో డాటాఎంట్రీ ఆపరేటర్లు, గార్డ్‌లు, కిచెన్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్టినేట్లు, లైబ్రేరియన్‌లుగా కొత్తగా 13 మందిని నియమించాం’.
– వి.సర్వేశ్వర్‌రెడ్డి, అదనపు సంచాలకుడు, గిరిజన సంక్షేమ శాఖ