కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలోని గిరిజన యువతులకు మొట్టమొదటి సారిగా నర్సింగ్‌లో శిక్షణ అందించేందుకు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఆర్‌ఎం గిరిధర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సింగ్ కోర్సు చేసేందుకు తగిన ఆర్థిక స్థోమత లేని కారణంగా గిరిజన యువతులు ఆసక్తి కనబరచని నేపథ్యంలో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ లేదా ఎంపీహెచ్‌డబ్ల్యు (ఎఫ్) 18 నెలల ఏఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణులై, 17 నుంచి 38 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వారి కుటుంబ సభ్యుల సంవత్సరాదాయం రూ.2.50 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించడం జరిగిందని, అర్హులైన వారు జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులను ఈ నెల 12వ తేదీలోగా అందజేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కళాశాలలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు.