ఎవరెస్టు ఎక్కిన గిరిజన యువకుడు
మోతుగూడెం: ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యాన్ని ఓ గిరిజన యువకుడు ఎట్టకేలకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం మండలం కొత్తపల్లికి చెందిన దూపు భద్రయ్య(27) పదో తరగతి వరకు చదువుకున్నాడు. పస్తుతం అతడు లోయర్ సీలేరు జెన్‌కో జల విద్యుత్ ప్రాజెక్టులో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలనే కోరిక బలీయంగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తన లక్ష్యాన్ని రంపచోడవరం ఐటీడీఏ పీవోగా ఉన్న చక్రధర్‌బాబుకు తెలిపాడు.
సాయం కోసం ఆర్థించాడు. అతడి విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసిన పీవో మూడేళ్ల క్రితం రూ.25 లక్షల సాయం అందేలా కృషి చేశారు. అలా అందిన ఆర్థిక సాయంతో కావల్సిన శిక్షణ, సాధన సామగ్రిని భద్రయ్య సమకూర్చుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌బాబు వద్ద పర్వతారోహణలో శిక్షణ పొందాడు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎవరెస్ట్ అధిరోహకుల బృందంలో ఒక్కడిగా భద్రయ్య శుక్రవారం ఉదయం ఎవరెస్టు అధిరోహించాడు. తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన భద్రయ్యకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.