ఎస్సారెస్పీకి భారీగా వరద ప్రవాహం
- 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- మిగతా గోదావరి ప్రాజెక్టుల్లోకి స్థిరంగా ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రాజెక్టులోకి 40వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.70 టీఎంసీల నిల్వ ఉంది. ఇక గోదావరి బేసిన్‌లోని మిగతా ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి.
సింగూరులోకి 3,135 క్యూసెక్కులు, నిజాంసాగర్లోకి 1,765, ఎల్లంపల్లికి 12,724, కడెంలోకి 3,130 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. ఇక కృష్ణాబేసిన్‌లో ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టికి 27వేలకు పైగా క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 18,171 క్యూసెక్కులు వస్తుండగా, శ్రీశైలానికి 4,687, సాగర్‌కు 907, జూరాలకు 9,766 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి.