- రేపటినుంచి కాకతీయ కాల్వ ద్వారా విడుదల
- ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో ఆనందం
ఎల్‌ఎండీకి ఎస్సారెస్పీ నీళ్లు
Published Mon, Aug 1 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల అగ్రికల్చర్ : గత రెండేళ్లుగా డెడ్‌స్టోరేజీ నీటి నిల్వతో కళావిహీనంగా మారిన దిగువ మానేరు జలాశయానికి (ఎల్‌ఎండీ) జలకళ రానుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగంలో ఆశలు రేకెత్తించింది. సోమవారం మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ నీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో చర్చించారు. ఎస్సారెస్పీ సామర్థ్యం 90టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సీఈ శంకర్ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు నేరుగా ఎస్సారెస్పీలో నిండుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గత రెండేళ్లుగా వర్షాల్లేక 5టీఎంసీల డెడ్‌స్టోరేజీకి వెళ్లిన ఎస్సారెస్పీ నీటిమట్టం 43 టీఎంసీలకు చేరడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరితే పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఆశించిన నీరు రావడంతో ఇచ్చిన హామీ మేరకు నీటిని విడుదల చేయనున్నారు. వరదకాల్వ ద్వారా కాకుండా.. కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేసి మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లోని చెరువులను నింపాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిసహా ఆ ప్రాంత రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. అందరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కాకతీయ కాలువ ద్వారానే ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే పొలాలకు, ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయమై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్టు సీఈ శంకర్ తెలిపారు.
మరో 2కోట్ల మొక్కలు నాటాలి
హరితహారంలో భాగంగా ఈనెలలో మరో 2కోట్ల మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది 4 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు 2.09 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మిగిలిన 2కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క అధికారి హరితహారంలో పాల్గొనాలని కోరారు. హరితహారంలో ప్రస్తుతం జిల్లా మూడో స్థానంలో ఉండగా, లక్ష్యం చేరుకుని రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలపాలన్నారు.
Advertisement
Advertisement