lmd
-
తొమ్మిది గంటలే !
మోర్తాడ్/బాల్కొండ : కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఫీడర్లకు 24 గంటలకు బదులు తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేయా లని ఎన్పీడీసీఎల్ అధికారులు నిర్ణయించారు. భారీ నీటిపారుదల శాఖ అధికారులు, విద్యుత్ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రెండు రోజుల నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటి పూట తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్ అందిస్తున్నారు. రబీ సీజను కోసం శ్రీరాంసాగర్ ప్రాజె క్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే కాకతీయ కాలువ పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటిని అందించుకోవడానికి రైతులు కాలువకు పంపుసెట్లను అమర్చుకున్నారు. గతంలో షిఫ్టింగ్ విధానంలో వ్యవసాయానికి రోజు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. అలాంటి సమయంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కాకతీయ కాలువ నుంచి రైతులు నీటిని పంట పొలాలకు తరలించేవారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో పంపుసెట్లు నిరంతరం పని చేస్తున్నాయి. కాలువకు దగ్గర ఉన్న పంట పొలాలకే కాకుండా దూరంగా ఉన్న పంట పొలాలకు కూడా పైప్‌లైన్‌ను వేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ నీరు స్థానికంగానే వినియోగం అవుతోంది. ఇటీవల నాలుగు టీఎంసీల నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఒక్కటే టీఎంసీ నీరు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు చేరే సరికి పరిమాణం తగ్గిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం కాకతీయ కాలువపై కొందరు రైతులు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటిని సరఫరా చేసుకోవడమే కారణం అని గుర్తించిన అధికారులు 24 గంటల విద్యుత్‌కు బ్రేక్ వేయాలని భావించారు. కాలువ వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లను తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. పంపుసెట్లను తొలగించడం కంటే విద్యుత్ సరఫరాను నియంత్రించడమే మేలు అని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. విద్యుత్ అధికారులతో చర్చించారు. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతాంగం కాకతీయ కాలువపై జీవీసీ–1 పరిధిలో సుమారు 2300 పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దాదాపు 20 విద్యుత్ ఫీడర్ల నుం చి విద్యుత్ సరఫరా అవుతోంది.ఈ ఫీడర్ల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను అధికారులు కుదించారు. ప్రస్తుత యాసంగిలో కాకతీయ ద్వార ఎల్ఎండీ వర కు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అధి కారులు ప్రకటించారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగిన అన్ని రోజుల పాటు తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. రైతులు అంగీకారం తెలపడం విశేషం. పంపు సెట్లు ఎందుకు... కాకతీయ కాలువకు పంపు సెట్లను అమర్చుకునే అవకాశం రైతులకు ఎందుకు ఇచ్చారంటే... కాలువ నిర్మాణంలో ఆయా గ్రామాలకు చెందిన చెరువులు రెండు వైపులా చీలి పోయాయి. దీంతో ఆయకట్టుకు నీటి వనరుల సౌకర్యం లేకుండా పోయింది. అంతే కాకుం డా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి లిప్టులను నిర్మిస్తుంది. ఇక్కడ ఎలాంటి లిప్టులు అవసరం లేకుండానే రైతులు స్వచ్ఛందంగా పంపు సెట్లు నిర్మించుకుని ఆయకట్టుకు నీటి సరఫరా చేసుకుంటున్నారు. పంపు సెట్లకు నిరంతరం నీటి సరఫరా కోసం కాకతీయ కాలువ ద్వార నిరంతరం లీకేజీ నీటి సరఫరా చేయాలని గతంలో ప్రత్యేక జీవో కోసం రైతులు ధర్నాలు చేశారు. అప్పటి పాలకులు ప్రత్యేక కృషి చేశారు. 50 క్యూసెక్కుల నీరు నిరంతరం నీటి సరఫరా చేయడానికి జీవో కూడ జారీ అయినట్లు అప్పటి పాలకులు ప్రచారం సైతం చేశారు. అధికారుల ఆదేశాల మేరకే .. కాకతీయ కాలువ వెంట ఉన్న ఫీడర్లకు రోజుకు తొమ్మిది గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అధికారుల ఆదేశాలను పాటించి విద్యుత్ సరఫరా కుదించాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. – బాబా శ్రీనివాస్, ఏఈ, ఎన్పీడీసీఎల్ ఏర్గట్ల సెక్షన్ -
ఎల్ఎండీ క్యాంపు క్వార్టర్లలో రికార్డులు చోరీ
తిమ్మాపూర్ : ఎల్ఎండీ క్యాంపులోని రెండు క్వార్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎల్ఎండీలోని క్వార్టర్లు బీ 173, 172లను గతంలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సబ్ డివిజన్ 1, 2లకు కేటాయించారు. తర్వాత సబ్ డివిజన్లను ధర్మారం, చందుర్తికి తరలించగా.. ఆ క్వార్టర్లలో రికార్డులను భద్రపరచి, స్టోర్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. రికార్డుల పరిశీలనకు అప్పుడప్పుడు ధర్మారం సబ్ డివిజన్ నుంచి సీనియర్ అసిస్టెంట్, చందుర్తి సబ్ డివిజన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వస్తూంటారు. మంగళవారం ధర్మారం సబ్ డివిజన్ రికార్డులున్న క్వార్టర్ బి–173 తాళం ధ్వంసం చేసి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చెక్క బీరువాలో రికార్డులను ఎత్తుకెళ్లారు. మూడు ఎంబీ రికార్డులు, ఇతర పత్రాలు, పరికరాలు కనిపించడం లేదని సీనియర్ అసిస్టెంట్ చెప్పారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. -
ఎల్ఎండీ దిగువకు 3వేల క్యూసెక్కుల నీరు విడుదల
దిగువకు ఒక తడి.. ఒక టీఎంసీ మాత్రమే ఎల్ఎండీ ఎగువకు ఎగువకు ఆరు తడులు ఎస్సారెస్పీ సీఈ శంకర్ తిమ్మాపూర్: లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదలను 3వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్(సీఈ) శంకర్ తెలిపారు. ఎల్ఎండీ ప్రధాన కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం పరిశీలించారు. ఎల్ఎండీ దిగువకు వెయ్యి క్యూసెక్కులు వదిలితే నీరు వేగంగా వెళ్లడం లేదన్నారు. దీంతో 3వేల క్యూసెక్కులకు పెంచి, గురువారం 2వేలకు, ఆ తరువాత వెయ్యి క్యూసెక్కులకు పరిమితం చేస్తామని చెప్పారు. మొత్తంగా ప్రస్తుతం ఒక తడి కోసం ఒక టీఎంసీ మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 0.4టీఎంసీలు విడుదల చేయగా ఇంకా 0.6టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఆ తరువాత ఎల్ఎండీలోకి ఇన్‌ఫ్లో ఉంటేనే ప్రభుత్వం నిర్ణయం మేరకు మిగతా తడులకు విడుదల ఉంటుందని వివరించారు. రైతులు గమనించి పంటలు ప్రస్తుతం సాగు చేయవద్దని, వేసిన పంటలనే కాపాడుకోవాలని కోరారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు ఈ నెల 23న రెండో తడి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల ఆన్, ఏడు రోజుల ఆప్ పద్ధతిన ఈనెల 31తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీల్లో చెట్లపొదలు, పూడిక ఉంటే ఉపాధి హామీ కింద తొలగించుకునేందుకు డ్వామా అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకోవాలని సూచించారు. సీఈ వెంట ఈఈ శ్రీనివాస్, డీఈఈ సత్యనారాయణ ఉన్నారు. -
ఎల్ఎండీలో పెరుగుతున్న నీటిమట్టం
తిమ్మాపూర్ : ఎస్సారెస్పీ నుంచి నీళ్లు విడుదల చేసిన నీరు రెండు రోజులుగా ఎల్ఎండీలో చేరుతోంది. దీంతో సోమవారం ఎల్ఎండీలో ఒక టీఎంసీ నీటిమట్టం పెరిగినట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఎల్ఎండీలో రెండు రోజుల క్రితం 2.3టీఎంసీల నీరుండగా.. ప్రస్తుతం 3.2 టీఎంసీలకు చేరింది. కాకతీయ, వరద కాల్వల ద్వారా 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. రెండు రోజుల్లో మరో టీఎంసీ నీటిమట్టం పెరుగనుంది. -
ఎల్ఎండీకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు
తిమ్మాపూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు లోయర్ మానేరు డ్యాంలోకి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నెల 3న ప్రారంభించారు. అక్కడినుంచి ఎల్ఎండీకి నీళ్లు చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ఎల్ఎండీలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. -
నేడు ఎల్ఎండీకి ఎస్సారెస్పీ నీరు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి 15టీఎంసీలు దాటితేనే ఎల్ఎండీ దిగువకు నీరు ఎస్సారెస్పీ సీఈ శంకర్ తిమ్మాపూర్: ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన నీరు ఎల్ఎండీకి శుక్రవారం చేరుతాయని ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్ తెలిపారు. ఎల్ఎండీలోని ఏసీఈ ఆఫీసులో గురువారం విలేకరులతో మాట్లాడారు. 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 13,086 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 46.45టీఎంసీ(1077.70అడుగులు)ల నీరు ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు 4500 క్యూసెక్కులు, వరద కాలువకు 6075 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. వర్షాలు పడుతున్నప్పుడు, నీటివిడుదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసిన నీరు గురువారం మధ్యాహ్నం 45 కిలోమీటర్లు(కోరుట్ల) వరకు వచ్చాయని పేర్కొన్నారు. ఎల్ఎండీకి శుక్రవారం ఉదయం వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. పోచంపాడ్ వద్ద రెండింటి ద్వారా ప్రస్తుతం 8యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నెల 10తేదీ తరువాత రైతులు కోరితే ఎల్ఎండీ ఎగువ ప్రాంత ఆయకట్టుకు ఎనిమిది రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్ పద్ధతిన ఎస్సారెస్పీ నుంచి నీటిని ఇస్తామని తెలిపారు. వీటికి సంబంధించి ఖరీఫ్ ప్రణాళికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో పెరిగితే గరిష్టంగా కాకతీయ కాలువ ద్వారా 7వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే శభాష్పల్లె బ్రిడ్జి కారణంగా వరదకాలువకు 10వేల వరకే వదులుతామని పేర్కొన్నారు. సారంగపూర్ మండలం రోళ్లవాగు కింద 15వేల ఎకరాల ఆయకట్టు ఉందని, ఇక్కడ తాగునీటికి ఇబ్బంది ఉండడంతో రోళ్లవాగుకు నీళ్లు ఇస్తామన్నారు.ప్రస్తుతం 2.50టీఎంసీలున్న ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి 15టీఎంసీల నీరు చేరుకోగానే ప్రభుత్వ నిర్ణయం మేరకు దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండొచ్చని చెప్పారు. ఎస్సారెస్పీ పరిధిలో 2లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యముండగా.. ఇప్పటి వరకు 1.10లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. -
నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీలోకి.. విడుదల చేసిన మంత్రులు ఈటల, పోచారం కాకతీయ, వరద కాల్వల ద్వారా 8,200 క్యూసెక్కులు ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు లక్ష్యంగా విడుదల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీలకు చేరిన నీరు త్వరలోనే ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు : మంత్రి ఈటల మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ.. ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం : మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాం(ఎల్ఎండీ)కు బుధవారం రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 2,200 క్యూస్కెకులు, వరద కాలువ ద్వారా మరో 6,000 క్యూస్కెల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. గురువారం వరదకాల్వ నుంచి అదే 6,000 క్యూసెక్కుల నీరు వెళ్లనుండగా, కాకతీయ కాల్వ నుంచి మాత్రం 4,400 క్యూసెక్కులు పెరగనుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో మంగళవారం 46 టీఎంసీలకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు నీటిని విడుదల చేసినట్లు మంత్రులు ప్రకటించారు. ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు చేరితే.. అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగు నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ నీటి విడుదల అనంతరం మంత్రులు ‘మీడియా’తో మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీరు చేరినందున అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికి ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు చేరుకున్నదని మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్లు వివరించారు. ఇంకా వస్తున్న ఇన్‌ఫ్లో వల్ల ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఆశిస్తున్నామని, తద్వారా ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చే నీటి వల్ల వరంగల్, కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు లభిస్తుందన్నారు. నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్షం : ఈటల పంటలు పండించడంలో నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం బాల్కొండ మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.. జిల్లాలో అంకాపూర్, అంక్సాపూర్ వంటి గ్రామాల్లో పసుపు, ఇతర పంటలు పండించడంతో జిల్లా దేశానికే ఆదర్శమైందన్నారు. తెలంగాణాలోని ప్రతి గ్రామం అంకాపూర్ల సాగులో ముందుండాలనే మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి ఎకరానికి నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రతి పక్షాలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మల్లన్న సాగర్‌కు అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిజమాబాద్ జిల్లా మొదటి నుంచి అండగా నిలిచిందన్నారు. అందుకే జిల్లాలో 9 మంది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు. మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ : పోచారం మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండాలంటే ఆగస్టు వరకు ఆగాల్సి వచ్చిందంటే గోదావరి ఎగువ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్‌లు నిర్మించడం వల్లనే అన్నారు. అలా కాకుండా రైతులకు సకాలంలో నీరందించాలనే శాశ్వత పరిష్కారం కోసం మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి జూన్–జూలై చివరి వరకు 1000 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. అలా వృథా కాకుండా నీటిని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి మల్లన్న సాగర్‌కు మళ్లించుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో ముంపునకు గురవుతన్న ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ప్రకటించారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ఎస్సారెస్పీ నింపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం అ«ధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి, జెన్కో డైరెక్టర్ వెంకటరత్నం, సీఈ మురళీధర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్‌యాదవ్, ఎంపీపీ అర్గుల్ రాధా, వైస్ ఎంపీపీ శేఖర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సామవెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ముస్కు భూమేశ్వర్, యూత్ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి పాల్గొన్నారు. ఎల్ఎండీలో 2.4 టీఎంసీల నీరు.. అందుకే నీటి విడుదల : ఎస్సారెస్పీ ఏసీఈ శంకర్ ఎస్సారెస్పీ నుంచి బుధవారం కాకతీయ, వరద కాలువల ద్వారా మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా క్రమంగా నీటి విడుదలను పెంచుతామని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ శంకర్ తెలిపారు. ఎల్ఎండీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ భాగన ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌లు విష్ణుపురి, బాబ్లీ ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. గైక్వాడ్ ప్రాజెక్ట్ కూడ 75 శాతం నిండిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉన్న నీటితో ఎస్సారెస్పీ మొదటి దశలో 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరందించుటకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీ లిప్ట్ వద్ద పనులు చేపట్టడానికి వీలు లేకుండా నీరు వచ్చి చేరడం వల్ల అనుకున్న సమయంలో లిఫ్ట్ పనులు పూర్తి చేయలేక పోయామన్నారు. రెండు మోటర్లు సిద్ధమయ్యయయన్నారు. ఆ రెండు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసి లక్ష్మీ కాలువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుతుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వార విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఒక్క టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా నుంచి కదలివచ్చిన నేతలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ వెంట కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి వచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్‌లు, కన్నూరు సంపత్‌రావు, పొనగండి మల్లయ్య, యేబూసి రామస్వామి, టి.రాజేశ్వర్‌రావు, చెల్పూరు ప్రభాకర్‌లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు ఎస్సారెస్పీ నీటి విడుదల సందర్భంగా మంత్రి వెంట పోచంపాడుకు వచ్చారు. -
ఎల్ఎండీకి ఎస్సారెస్పీ నీళ్లు
రేపటినుంచి కాకతీయ కాల్వ ద్వారా విడుదల ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో ఆనందం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల అగ్రికల్చర్ : గత రెండేళ్లుగా డెడ్‌స్టోరేజీ నీటి నిల్వతో కళావిహీనంగా మారిన దిగువ మానేరు జలాశయానికి (ఎల్ఎండీ) జలకళ రానుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండీకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగంలో ఆశలు రేకెత్తించింది. సోమవారం మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ నీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో చర్చించారు. ఎస్సారెస్పీ సామర్థ్యం 90టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సీఈ శంకర్ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు నేరుగా ఎస్సారెస్పీలో నిండుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గత రెండేళ్లుగా వర్షాల్లేక 5టీఎంసీల డెడ్‌స్టోరేజీకి వెళ్లిన ఎస్సారెస్పీ నీటిమట్టం 43 టీఎంసీలకు చేరడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరితే పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఆశించిన నీరు రావడంతో ఇచ్చిన హామీ మేరకు నీటిని విడుదల చేయనున్నారు. వరదకాల్వ ద్వారా కాకుండా.. కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండీకి నీటిని విడుదల చేసి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లోని చెరువులను నింపాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డిసహా ఆ ప్రాంత రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. అందరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కాకతీయ కాలువ ద్వారానే ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే పొలాలకు, ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయమై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్టు సీఈ శంకర్ తెలిపారు. మరో 2కోట్ల మొక్కలు నాటాలి హరితహారంలో భాగంగా ఈనెలలో మరో 2కోట్ల మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది 4 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు 2.09 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మిగిలిన 2కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క అధికారి హరితహారంలో పాల్గొనాలని కోరారు. హరితహారంలో ప్రస్తుతం జిల్లా మూడో స్థానంలో ఉండగా, లక్ష్యం చేరుకుని రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలపాలన్నారు. -
ఎల్ఎండీలో బీసీ బాలికల గురుకుల కళాశాలకు అనుమతి
తిమ్మాపూర్: ఎల్ఎండీలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 బీసీ గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయగా.. జిల్లాలో ఎల్ఎండీలోని బాలికల గురుకుల పాఠశాల ఒకటి. 2016–17 విద్యా సంవత్సరంలోనే జూనియర్ కళాశాల ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తామని, వీటికి ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టులో జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పక్కా భవనంలో గదులు లేని కారణంగా భవనం అద్దెకు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
రోడ్డు పక్కన శవం.. ఇల్లు లేక దైన్యం..
తిమ్మాపూర్: అద్దె ఇళ్లలో ఉంటున్నవారి దైన్య పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాత నుస్తులాపూర్‌లో జరిగింది. నుస్తులాపూర్‌కు చెందిన ఎన్నం రాజిరెడ్డి తమ గ్రామం ఎల్ఎండీలో మునిగిపోవడంతో 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా రామకృష్ణకాలనీకి వచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లారు. రాజిరెడ్డికి ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు సంతానం కాగా, పెద్ద బిడ్డకు పెళ్లి చేశాడు. రాజిరెడ్డి దంపతులు కొడుకు సత్తిరెడ్డి, చిన్న కూతురు పటాన్‌చెరువులో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం సత్తిరెడ్డితోపాటు తల్లి సారమ్మ అనారోగ్యానికి గురయ్యారు. శనివారం సాయంత్రం సత్తిరెడ్డి మృతి చెందగా, శవాన్ని తీసుకెళ్లాలని ఇంటి యజమాని అంబులెన్స్‌ని మాట్లాడి పంపించారు. దీంతో దిక్కులేని స్థితిలో ఆదివారం రామకృష్ణకాలనీ చేరుకున్నారు. ఇక్కడ రాజిరెడ్డి సోదరుడు లకా్ష్మరెడ్డి ఉన్నా అతనికి భార్యాపిల్లలు, ఇల్లు లేదు. దీంతో శవాన్ని ఎవరి ఇంటికి తీసుకెళ్లాలనే సమస్య వచ్చింది. దీంతో రాజిరెడ్డి బంధువు బాపురెడ్డి, స్థానికుడు దావు సంపత్‌రెడ్డిలు మృతదేహాన్ని రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. గ్రామస్తులతోపాటు మొలంగూర్‌లో ఉంటున్న బంధువులు ఆర్థికసాయం అందించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం రాజిరెడ్డి కుటుంబానికి రామకృష్ణకాలనీలోనే ఉంటున్న ఆయన బంధువు బాపురెడ్డి ఆశ్రయమిచ్చాడు. దావు సంపత్‌రెడ్డి బియ్యం వితరణ చేశారు. -
సీఎం కేసీఆర్ సెక్యూరిటీ హెలీకాప్టర్‌కు తప్పిన ప్రమాదం
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పర్యటనకు ముందు వచ్చిన సెక్యూరిటీ హెలీకాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండి) వద్ద సెక్యూరిటీ హెలీకాప్టర్ ల్యాండింగ్‌కు సిగ్నల్స్ కోసం పోలీసులు పొగపెట్టారు. అయితే అగ్గి రగిలి అక్కడ ఉన్న గడ్డివాము దగ్ధమైంది. దాంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ** -
వరంగల్‌కు నీళ్లు బంద్ చేస్తాం
నగరంలో ప్రతి ఇంటికీ నీటి సరఫరా *ఆగస్టు 15న కేసీఆర్ ప్రోగ్రాం ప్రారంభం *ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టవర్‌సర్కిల్ : ఈ సీజన్లో వర్షాలు పడకుండా నీటి ఎద్దడి ఎదురైతే వరంగల్ నగరానికి ఎల్ఎండీ నుంచి చేసే నీటి సరఫరాను నిలిపివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. నగరంలోని ఫిల్టర్‌బెడ్ సమీపంలో ప్రతీరోజు నీటి సరఫరా కోసం జరుగుతున్న పైపులైన్ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నగరప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ యంత్రాంగం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. నగరానికి నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్‌లో 58 ఎంఎల్డీ నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉందని, పైపులైన్ పనులు పూర్తయితే ప్రతి ఇంటికి నల్లా నీరు ప్రతీరోజు గంటపాటు సమయానుకూలంగా ఇస్తామని తెలిపారు. ప్రతి డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.7.3కోట్లతో జరుగుతున్న పైపులైన్ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. 20 సంవత్సరాల వరకు నగర నీటి సరఫరాకు ఇబ్బంది ఉండకుండా చూస్తామని స్పష్టంచేశారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) ప్రోగ్రాంను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. అదేరోజు ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభమవుతుందని తెలిపారు. మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్ ఏవీ.రమణ, కమిషనర్ కె.రమేశ్, ఈఈ భద్రయ్య, నాయకులు చల్ల హరిశంకర్, బోయినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎల్ఎండీ నుంచి నీరు విడుదల
కార్పొరేషన్ : వరంగల్ నగర ప్రజలకు మంచినీటి కబురు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి ప్రతీ రోజు రెండు దఫాలుగా నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం 9-30 గంటలకు 500 క్యూసెక్కులు, సాయంత్రం 6 గంటలకు మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నీరు వరంగల్ నగరానికి శుక్రవారం సాయంత్రం వరకు చేరుకునే అవకాశం ఉందని బల్దియా ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పది రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వివరించారు. వరంగల్ నగరపాలక సంస్థ సమ్మర్ స్టోరేజీలలోని ధర్మసాగర్ డెడ్ స్టోరేజీకి మారింది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో నీరు చాల తక్కువగా ఉంది. దీంతో జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి కిషన్, కమిషనర్ సువర్ణ పండాదాస్, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు కొండాసురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్ ఎల్ఎండీ నుంచి ఒక టీఎంసీ(1,000 ఎంసీఎఫ్‌టీలు) నీరు విడుదల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావు చొరవ చూపడంతో ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఎల్ఎండీ ఇంజినీర్లు మాత్రం 500 ఎంసీఎఫ్‌టీల నీరు మాత్రమే విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసిన సందర్భంగా డ్యామ్ వద్ద బల్దియా ఈఈలు సుచరణ్, నిత్యాం నదం, నందకిశోర్, ఏఈలు భాస్కర్‌రావు, ప్రభువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కెనాల్ నీటిపై నిఘా కాకతీయ కెనాల్ నుంచి నగరానికి వచ్చే నీటిని మధ్యలో మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు మూడు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. 65 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కెనాల్ వెంట నిఘా బృందాలు రాత్రింబ వళ్లు కాపుకాస్తాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బృందం, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మరో బృందం నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా లీకేజీలు ఏర్పడినా, నీటిని మళ్లించే ప్రయత్నం జరిగినా వెంటనే నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేదీ వరకు బృందాలు విధులు నిర్వర్తించనున్నారు. పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తి :ఎస్ఈ ఉపేంద్రసింగ్ ఎల్ఎండీ నుంచి నీరు విడుదల అయినందున సమ్మర్ స్టోరేజీల్లో నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్ఈ ఉపేంద్రసింగ్ తెలిపారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులను సామర్థ్యం మేరకు నింపేందుకు మోటార్లు సిద్ధం చేశామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం నాటికి నీరు చేరుతుందని, పది రోజుల పాటు విడుదలయ్యే ఈ నీటిని పొదుపుగా వాడుకుంటామన్నారు. ఒక్కపక్క సమ్మర్ స్టోరేజీలకు పంపింగ్ చేస్తూనే మరోవైపు కేయూసీ, దేశాయిపేట, వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ల ద్వారా నీటిని శుద్ధిచేసి నగర ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి నగరంలో తాగునీటి సరఫరా జరుగుతుందని వివరించారు.