ఈ సీజన్‌లో వర్షాలు పడకుండా నీటి ఎద్దడి ఎదురైతే వరంగల్...
నగరంలో ప్రతి ఇంటికీ నీటి సరఫరా
*ఆగస్టు 15న కేసీఆర్ ప్రోగ్రాం ప్రారంభం
*ఎమ్మెల్యే గంగుల కమలాకర్
టవర్‌సర్కిల్ : ఈ సీజన్‌లో వర్షాలు పడకుండా నీటి ఎద్దడి ఎదురైతే వరంగల్ నగరానికి ఎల్‌ఎండీ నుంచి చేసే నీటి సరఫరాను నిలిపివేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. నగరంలోని ఫిల్టర్‌బెడ్ సమీపంలో ప్రతీరోజు నీటి సరఫరా కోసం జరుగుతున్న పైపులైన్ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నగరప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ యంత్రాంగం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. నగరానికి నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్‌లో 58 ఎంఎల్‌డీ నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉందని, పైపులైన్ పనులు పూర్తయితే ప్రతి ఇంటికి నల్లా నీరు ప్రతీరోజు గంటపాటు సమయానుకూలంగా ఇస్తామని తెలిపారు.
ప్రతి డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.7.3కోట్లతో జరుగుతున్న పైపులైన్ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. 20 సంవత్సరాల వరకు నగర నీటి సరఫరాకు ఇబ్బంది ఉండకుండా చూస్తామని స్పష్టంచేశారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) ప్రోగ్రాంను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. అదేరోజు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రారంభమవుతుందని తెలిపారు. మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్ ఏవీ.రమణ, కమిషనర్ కె.రమేశ్, ఈఈ భద్రయ్య, నాయకులు చల్ల హరిశంకర్, బోయినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.