ఎస్సారెస్పీ కెనాల్‌కు అడ్డుగోడ?
- సింగరేణి..ఎస్సారెస్పీ అధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం
- అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టుతో కుంగిన కాలువ
- నీటి ప్రవాహంతో ప్రమాదమని భావిస్తున్న సింగరేణి
- ఎల్–6 పరిధిలోని 12 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం
మంథని(కరీంనగర్) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్–6 కెనాల్‌కు అడ్డుగోడ నిర్మించేందుకు సింగరేణి, ఎస్సారెస్పీ అధికారులు పరస్పరం ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే విషయం బయటకు పొక్కితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సింగరేణి అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి వెంట ముత్తారం మండలం రాజాపూర్ నుంచి మంథని మండలంలోకి ఎల్–6 కెనాల్ ప్రవేశిస్తుంది. ఈ కెనాల్ ద్వారా 10 గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది.
కాలువకు సమీపంలోనే అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఉంది. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా రూ.1250 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టుకు సమీపం నుంచే కాలువ ఉండడం ప్రమాదమని గుర్తించిన సింగరేణి ప్రత్యామ్నాయంగా కాలువను మళ్లించేందుకు సిద్ధమై ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలివేసింది. ఐతే అడ్రియాల గ్రామ శివారులోని పెద్ద మోరీ నుంచి సుమారు 1.5 కిటోమీటర్ మేర కాలువ కుంగిపోవడంతో నీరు ముందు సాగడంలేదు. కాలువకు నీరు వదిలితే ముందున్న పంటలకు నీరు పారే పరిస్థితి లేదు. నీరంతా అడ్రియాల సమీపంలోని కల్వర్టు వద్ద వృథాగా పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో లోతుగా బొగ్గును వెలికితీయడంతో కాలువ కుంగిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువ ద్వారా నీరు పారితే ప్రాజెక్టులోకి నీటి ఊట వచ్చి ప్రమాదముందని సింగరేణి సైతం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎల్–6 కెనాల్ ప్రారంభంలోనే అడ్డుగోడ నిర్మించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సీజన్‌లో కాలువ కింద పంట పొలాలకు క్రాప్ హలీడే ప్రకటించి కొంతమేర నష్టపరిహారం చెల్లించాలని భావిస్తున్నట్లు తెలిసింది.