
సాక్షి, నిజామాబాద్ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని ఓట్లకోసం చేపట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, రైతుల రుణం తీర్చుకోవడానికి, పదవిలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక గుర్తుండే పని చేయాలనే తలంపుతో చేశామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతల మాటలు వింటుంటే జాలేస్తుందన్నారు. కాళేశ్వరం జలాలు ఎలా వస్తాయనే ప్రతిపక్షాల హేళనలన్నీ భరించిన కేసీఆర్ ఇప్పుడు అపర భగీరథుడయ్యాడని ప్రశంసించారు. మరోవైపు తెలంగాణ దేశానికే ఆదర్శమని కొత్త గవర్నర్ చెప్పడం హర్షదాయకమని తెలిపారు.