అంత్య పుష్కరాలు ఆరంభం
అంత్య పుష్కరాలు ఆరంభం
Published Mon, Aug 1 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
జిల్లాలో ఆదివారం గోదావరి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం, మోర్తాడ్ మండలం తడపాకల్, బాల్కొండ మండలం సావెల్, నందిపేట మండలం ఉమ్మెడ ఘాట్‌ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. మొదటి రోజు భక్తులు స్వల్పంగానే కనిపించారు.
నందిపేట : ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదిలో అంత్య పుష్కరాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ప్రారంభించారు. గోదావరికి హారతి ఇచ్చారు. సమీపంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం, ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంతో భక్తుల రద్దీ అంతంతగానే ఉంది. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, దేవదాయ శాఖ బోధన్ ఈవో వేణు, ఆలయ ఇన్‌చార్జి ఈవో సుదర్శన్, నాయకులు సాయరెడ్డి, సాగర్, రాజేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను ప్రారంభించారు. వేదపండితులు పుష్కరుడికి ఎస్సారెస్పీ కోదండ రామాలయం నుంచి ఆహ్వనం పలికారు. ఆది పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యతే గోదావరి అంత్య పుష్కరాలకు ఉంటుందని వేద పండితులు తెలిపారు. భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. పూజాదుల్లో సర్పంచ్ శ్రీవాణి రమేశ్, దేవాదాయ శాఖ ఈవో గంగాధర్, రామాలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సావెల్ పుష్కర ఘాట్ వద్ద..
సావెల్ పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను సర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. భక్తులు పుష్కర స్నానాలు చేశారు.
తడపాకల్‌లో..
మోర్తాడ్ : తడపాకల్‌లో సర్పంచ్ లావణ్య అంత్య పుష్కరాలను ప్రారంభించారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి స్థానిక భక్తులతో పాటు కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్లలనుంచి భక్తులు తరలివచ్చారు.
సర్కారు ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
రెంజల్ : కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలు బోధన్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెంజల్ ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, గోదావరిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీఆర్వోలతో పాటు వీఆర్‌ఏలను అప్రమత్తం చేశామని, ఇద్దరు కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున భక్తులు ఘాట్లపైనే స్నానాలాచరించాలని సూచించారు.
అంత్య పుష్కరాలకు అంతంతే..
ఆది పుష్కరాలకు ఘనమైన ఏర్పాట్లు చేసిన సర్కారు.. అంత్య పుష్కరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సరైన ప్రచారం చేయకపోవడంతోపాటు పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలూ కల్పించలేదు. దీంతో పుష్కర ఘాట్ల వద్ద రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం కావడంతో హైదరాబాద్, కామారెడ్డి, అదిలాబాద్‌లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.
నిరాశ కలిగింది..
గతేడాది ఆది పుష్కరాలకు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి వెళ్లాం. త్రివేణి సంగమస్థలి, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం కావడంతో ఈసారి కందకుర్తికి వచ్చాం. కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో నిరాశ చెందాం. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించాలి.
– సువర్ణ, హైదరాబాద్
ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది
ఆది పుష్కరాల సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు పుష్కర స్నానం చేయలేకపోయాను. అంత్య పుష్కరాల్లో పాల్గొందామని కందకుర్తికి వచ్చాను. కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం గోదావరి నది అంత్య పుష్కరాలను చిన్నచూపు చూస్తోంది. ఇది సరికాదు. పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి.
– శేర్ల రాములు, కామారెడ్డి
వసతులు కల్పించాలి
గోదావరి ఆది పుష్కరాలను ఘనంగా నిర్వహించారు. అంత్య పుష్కరాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరికాదు. అంత్య పుష్కరాలకూ సరైన ఏర్పాట్లు చేయాలి. పుష్కర స్నానాల నిమిత్తం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించాలి. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను తెరిపించాలి.
– రమేశ్‌రెడ్డి, నిజామాబాద్
Advertisement
Advertisement