గోదా’వర్రీ’
గోదా’వర్రీ’
Published Fri, Feb 17 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
నదిలో భారీగా తగ్గిపోయిన ప్రవాహ జలాలు
సీలేరుపైనే భారం
రోజు 4,500 క్యూసెక్కులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
నిండు గోదావరిలో నీళ్లులేక ఎండు గోదావరిలా మారింది. నదిలోకి వచ్చి చేరే ప్రవాహ జలాలు 2,500 క్యూసెక్కులకు పడిపోవడంతో వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒక్క పశ్చిమ డెల్టాకే రోజుకు 4,500 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు నీటి పారుదల యంత్రాంగం రంగంలోకి దిగింది. రబీ పంటకు సాగునీటి ఇబ్బంది లేకుండా నిత్యం 4,500 క్యూసెక్కుల నీరు కచ్చితంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ రాంబాబును ఆదేశించారు. గోదావరిలో ఇన్‌ఫ్లో తగ్గడం వల్ల శివారు ప్రాంత భూములకు నీరందటం లేదని రైతులు చెబుతున్నారని, జిల్లాలో వేసిన ప్రతి ఎకరం పంటనూ కాపాడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే సీలేరు నుంచి అదనపు జలాలను రప్పించి గోదావరిలో నీటిమట్టం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. పొలాలకు మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో నీరందించాల్సి ఉందన్నారు. ఎస్‌ఈ రాంబాబు స్పందిస్తూ గోదావరి ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులకు పడిపోవడంతో సీలేరు నుంచి 5400 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి మొత్తం 7,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైతే సీలేరు నుంచి మరో వెయ్యి క్యూసెక్కుల నీరు రప్పించి పశ్చిమ డెల్టాకు 4500 క్యూసెక్కులకు తగ్గకుండా నిరంతరం నీరివ్వాలని కోరారు. నీరు తగ్గితే రైతులు చాలా నష్టపోతారని ఈ దశలో మరింత సమన్వయంతో పనిచేస్తూ గోదావరి నీటి మట్టం తగ్గకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
Advertisement
Advertisement