మళ్లీ జల జగడం! | krishna , godavari affair start again in telangana ,ap | Sakshi
Sakshi News home page

మళ్లీ జల జగడం!

Published Thu, May 5 2016 2:57 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

మళ్లీ జల జగడం! - Sakshi

మళ్లీ జల జగడం!

చినుకు రాలకముందే తెలంగాణ, ఏపీల మధ్య ముదురుతున్న వివాదం
పాలమూరు, డిండి, కల్వకుర్తిలపై మరోమారు కేంద్రానికి ఏపీ ఫిర్యాదు
సాగర్, శ్రీశైలం డ్యామ్‌ల నిర్వహణ బోర్డు పరిధిలోకి తేవాలని పట్టు
ఏపీ ఒత్తిడితో రంగంలోకి బోర్డు..
దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణకు ఆదేశం
శ్రీశైలంలో ఏపీకి కేటాయింపుల తీరుపై తెలంగాణ కన్నెర్ర

సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది. గతేడాది ప్రాజెక్టుల్లో నీటి పంపకాలపై మొదలైన వివాదాలు.. ఈసారి ఇంకా చినుకు కూడా కురవకముందే మరింతగా ముదురుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం, ట్రిబ్యునల్, బోర్డుల అనుమతి లేదంటూ ఏపీ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తడం, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం తాజా వివాదానికి ఊతమిచ్చింది. ఏపీ ఫిర్యాదులు, కేంద్రంపై తెస్తున్న ఒత్తిడితో కదిలిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఆయా ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాల ని తెలంగాణకు ఆదేశాలిచ్చింది. దీనికితోడు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలంలను నియంత్రణలోకి తెచ్చుకోవాలం టూ ఏపీ పట్టుబడుతుండడం.. దీనిపై వైఖరి చెప్పాలని తెలంగాణను బోర్డు కోరడం సైతం వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయి.

 వాదనంతా వాటాల చుట్టూనే?
బచావత్ అవార్డు మేరకు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. దాంతోపాటు మరో 75 టీఎంసీల మిగులు జలాలను తమకు కేటాయించినట్లు తెలంగాణ చెబుతోంది. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుల వారీ కేటాయింపులున్నా.. అవేవీ ప్రస్తుతం పూర్తికాకపోవడంతో, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటానని స్పష్టం చేస్తోంది. ఉన్న నీటి వాటాలోంచే పాలమూరు, డిండి ఎత్తిపోతలను చేపట్టామని చెబుతోంది. ఇక పట్టిసీమలో ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45టీఎంసీల్లో దక్కే వాటా నీటి తో ప్రాజెక్టులు చేపట్టామని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు తాజాగా మరోమారు పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. స్పందించిన బోర్డు... కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచడంపై రెండు రోజుల కిందట... పాలమూరు, డిండిలపై బుధవారం వివరణ కోరింది. వాటి కి కేటాయించిన నీటిని ఎక్కడి నుంచి, ఎలా తీసుకుంటారో తెలపాలని ఆదేశించింది.

 వాటా వినియోగ ముసాయిదా ఎలా?
కృష్ణా జల వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో గతేడాది జూన్‌లో రెండు రాష్ట్రాలు కేంద్రం సమక్షంలో చర్చలు జరిపి ఓ ముసాయిదాను రూపొందించుకున్నాయి. దాని ప్రకారం కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయనే అభిప్రాయనికి వచ్చి.. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి, విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఆదేశాలిస్తుందని, వాటిని ఇరు రాష్ట్రాలు పాటించాలని అందులో పొందుపరిచారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను గుండుగుత్త (ఎన్‌బ్లాక్)గా కేటాయించిందని..

అందులో విభజన అనంతర ం తెలంగాణకు ఇచ్చిన 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్‌బ్లాక్‌గానే చూడాలని తీర్మానించుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముసాయిదా గడువు వచ్చే నెలతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అదే ముసాయిదాను కొనసాగించాలా, లేక కొత్తగా ఏవైనా అంశాలు చేర్చాలా? అన్నది తెలపాలని బోర్డు తెలంగాణను కోరింది. మరోవైపు నీటి మట్టాలు పూర్తిగా అడుగంటిన ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలంలో ఏపీకి 6 టీఎంసీల నీటిని కేటాయించడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాటా మేరకు నీటిని ఏపీ వాడుకున్నా, మళ్లీ 6 టీఎంసీలు ఎలా కేటాయించారో తెలపాలంటూ బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది.

 పెద్ద వివాదాన్ని లేవనెత్తిన బోర్డు!
ఏపీ, తెలంగాణల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని.. ఏపీ ఫిర్యాదుతో కృష్ణా బోర్డు మళ్లీ కదిలించింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలంటూ గతంలో ఏపీ చేసిన ఫిర్యాదును బోర్డు తోసిపుచ్చింది. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకోలేమని స్పష్టం చేసింది. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు దానిపై పెత్తనం చేస్తున్నారని... దాన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ ఇటీవల మరోమారు బోర్డును కోరినట్లు తెలుస్తోంది.

అయితే నీటి వినియోగంపై గతంలో కేంద్రం సమక్షంలో స్పష్టమైన అవగాహన కుదిరినందున నియంత్రణ అవసరం లేదని తెలంగాణ వాదిస్తోంది. అయితే అవగాహన గడువు కేవలం ఏడాదేనని, ఆ గడువు వచ్చే నెలతో ముగుస్తున్నందున తాజాగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాసిన లేఖలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశాలపై అభిప్రాయం చెప్పాలని బోర్డు తెలంగాణను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement