నిండా మునించిన నిర్లక్ష్యం
-
మానాల వద్ద కాకతీయ కాల్వకు భారీ గండి
-
1500 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
-
మ్యాడంపల్లి ఎస్సీ కాలనీ జలమయం
-
300 కుటుంబాలు శిబిరానికి తరలింపు
-
మూడేళ్ల క్రితం ఇదే డి–65 వద్ద గండి
-
ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న వైనం
-
నిధులివ్వని సర్కారు.. పూర్తికాని కాల్వ లైనింగ్
-
పునర్మించడానికి 20–30 రోజులు పట్టే అవకాశం
జగిత్యాల అగ్రికల్చర్/మల్యాల : గతకొద్ది రోజులుగా ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎల్‌ఎండీకి నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మానాల సమీపంలోని డీ–65 డిస్ట్రిబ్యూటరీకి వద్ద కాల్వకు గండి పడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మల్యాల మండలం మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు తక్కళ్లపల్లి శివారులో సహాయ శిబిరం ఏర్పాటు చేసి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక సహా ఎస్సారెస్పీ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. కాల్వలో వస్తున్న నీటిని ఎస్కేప్ రెగ్యులేటర్ల ద్వారా ఎగువ ప్రాంతంలోని చెరువులకు మళ్లిస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వకు మల్యాల మండలం మానాల వద్ద భారీ గండి పడి, సాగు, తాగునీరు వృథా కావడమే కాకుండా నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీనికంతటికి ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం కారణంగా కనపడుతోంది. మానాల గుట్టల కింద నుంచి సొరంగ మార్గం ద్వారా కాకతీయ కాల్వ వెళ్తోంది. గుట్టలు దాటిన తర్వాత లోతట్టు ప్రాంతం ఉండగా, దాని పక్కనే దమ్మక్క చెరువుంది. దీంతో ఇక్కడ కాకతీయ కాల్వ నిర్మించే సమయంలో కాల్వకు రెండు పక్కల మట్టి పోశారు. ఇక్కడే చెరువు నింపేందుకు, పొలాలకు సాగునీరు అందించేందుకు డి–65 డిస్ట్రిబ్యూటరీ నిర్మించారు. ప్రస్తుతం ఈ డిస్ట్రిబ్యూటరీ దగ్గరే గండి పడింది. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా డిస్ట్రిబ్యూటరీ వద్ద లీకేజీ ఏర్పడుతోంది. నీరు విడుదల చేసినప్పుడల్లా ఏర్పడే చిన్న చిన్న లీకేజీలను ఎస్సారెస్పీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది.
ఇసుక బస్తాలతో మరమ్మతు
ప్రస్తుతం కాలువకు గండిపడ్డ ప్రదేశంలో గతంలో పలుమార్లు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇలా జరిగినప్పుడల్లా తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయడం, చిన్నపాటి మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటైంది. సకాలంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం కావడంతో ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో మరమ్మతు పనుల కోసం దాదాపు రూ.25 లక్షలతో అంచనావేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, నిధులు మంజూరు కాలేదని సమాచారం. తాజాగా ఎస్సారెస్పీ నీటిని ఎల్‌ఎండీకి తరలించేందుకు కాల్వ సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేశారు. దీనికితోడు కాలువకు ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటరీ తూములను మూసివేశారు. కొంపల్లె చెరువు వద్ద ఉన్న సైఫన్ వద్ద ఉన్న మూడు గేట్లకు బదులుగా అధికారులు రెండు గేట్లు మాత్రమే తెరవడంతో నీటి కాల్వలో నీటిమట్టం పెరిగింది. దీంతో గతంలో గండిపడిన డీ–65 తూము వద్ద మరోసారి గండి పడింది. మూడేళ్ల క్రితం డీ–65 తూము వద్ద గండిపడగా, తాత్కాలిక చర్యల్లో భాగంగా ఇసుక సంచులతో గండిపూడ్చారు. శాశ్వత పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో టెండర్ రద్దు చేశారు. మరోవైపు కాకతీయ కాల్వ లైనింగ్‌పై పెరిగిన చెట్లతోపాటు పలుచోట్ల లైనింగ్ పగుళ్లు ఉన్నచోట్ల పెరిగిన చెట్లను కొట్టివేసి కాల్వలోనే పడేస్తుండటం కూడా ఒక కారణంగా కనపడుతోంది. నెలరోజుల క్రితం కొంపల్లె చెరువు సమీపంలోని సైఫన్ వద్ద కాలువలో కొట్టిపడేసిన చెట్లు వచ్చి గేట్లకు అడ్డుగా ఆగడంతో కాలువ మునిగేందుకు ఆరమీటర్ మాత్రమే మిగిలింది. స్థానికుల సమాచారం మేరకు జేసీబీ సాయంతో వాటిని తొలగించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఇక్కడ అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులను అటు ప్రభుత్వం, ఇటు ఎస్సారెస్పీ యంత్రాంగం విస్మరించింది.
పూర్తి కాని లైనింగ్
ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ వరంగల్ జిల్లా వరకు 284 కిలోమీటర్లు పొడవుంది. కాల్వ ప్రారంభం నుంచి జగిత్యాల మండలం మోరపల్లి వద్దగల డి–53 (68 కి.మీ) వరకు సిమెంట్ లైనింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. వేసవిలో 68–84 కి.మీ. వరకు లైనింగ్ చేపట్టారు. ప్రస్తుతం 84–146 కి.మీ.(కరీంనగర్ వరకు) లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మధ్యలోనే డి–65 (దాదాపు 90 కి.మీ) వద్ద మానాల వద్ద గండి పడింది. గత రెండేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో కాల్వ వెంబడి పిచ్చిమొక్కలు పెరిగాయి. వీటిని గమనించకుండా మామూలు లీకేజిగానే భావించడంతోనే భారీగా గండి పడింది.
కాలువ పరిస్థితి అంతంతే..
కాకతీయ కాల్వ గరిష్ట సామర్థ్యం 9750 క్యూసెక్కులు. కాల్వ వెడల్పు 37.796 మీటర్లుంది. కాల్వ బలహీనంగా మారడంతో 4–6 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుంటారు. గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని వదిలితే కాల్వకు పలుచోట్ల మానాల మాదిరిగా గండ్లు పడే అవకాశం ఉంది. కాల్వ వెంబడి నిర్మించిన సైఫన్‌లు, అక్విడేట్‌లు, యూటీలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా యూటీలలో (కింది నుంచి వర్షం నీరు పోవడం, పై నుంచి కాలువ పోవడం) ఇసుక మేటలు వేసి వర్షం వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. కాకతీయ కాల్వ వెంబడి దాదాపు 20 వరకు యూటీలు ఉన్నప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు.
మరమ్మతులు పూర్తయితేనే పంటలకు నీళ్లు
మానాల వద్ద కాల్వ గండి పూడ్చివేత పనులు పూర్తయితేనే తిరిగి పంటలకు సాగునీరు అందించే అవకాశముంది. ప్రస్తుతం గండి పడిన చోట మరమ్మతులు పూర్తి కావాలంటే కనీసం 20–30 రోజులు పట్టే అవకాశం ఉంది. గండి పడినచోట భూమి లెవల్లో కాల్వ ఉండదు కాబట్టి కొత్తగా సిమెంట్‌తో నిర్మించాల్సి ఉంటుంది.