న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్‌పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment