
అయ్యో ‘శ్రీరామా..’!
►ఎడారిని తలపిస్తున్న ఎస్సారెస్పీ
► 8.26 టీఎంసీలకు పడిపోయిన నిల్వ
►ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవంటున్న అధికారులు
►వర్షాల్లేక ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌కు చేరని నీరు
►ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం
► ప్రశ్నార్థకంగా 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు
► తాగునీటి పథకాలపైనా ప్రభావం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతోంది! నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండకు సైతం సాగునీరు అందించే ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ 8.26 టీంఎసీలకు పడిపోయింది. ఎంతటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినా.. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఇంతలా తగ్గిపోయిన దాఖలాల్లేవు. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ సహా 11 ప్రాజెక్టులు వరద నీటికి అడ్డంకిగా మారాయి. ఎస్సారెస్పీపై ఆరు జిల్లాల్లో 17,85,605 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్ట్ ఎడారిని తలపిస్తోంది.
ప్రశ్నార్థకంలో ఆయకట్టు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే తెలంగాణలో 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రాజెక్ట్‌లో నీరు లేక పోతే ఆ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్‌లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీరందుతోంది. అలాగే నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతల పథకాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలకు నీరు ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం ఆయకట్టు పడావు పడనుండగా.. ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మారే ప్రమాదం నెలకొంది.
పడిపోతున్న నిల్వ సామర్థ్యం
ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా పేరుకు పోయిందని సర్వేలు చెబుతున్నా.. ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. 1978లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాగానే సర్వే చేపట్టగా.. 112 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. 1994లో చేపట్టిన సర్వేలో నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. 2006లో సర్వే చేపట్టగా.. నీటి సామర్థ్యం 78 టీఎంసీలకు పడిపోయినట్లు వెల్లడైంది. అయితే ప్రాజెక్ట్ అధికారులు ఈ సర్వేను కొట్టి పారేశారు. 2013, 2014లో ఏపీఈఆర్‌ఎల్ సర్వే చేపట్టినా నివేదిక ఇంకా గుట్టుగానే ఉంది. ఈ నివేదిక వెల్లడైతే శ్రీరాంసాగర్‌లో ప్రాజెక్ట్ వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిల్వల వివరాలు బట్టబయలు కానున్నాయి.
తాగునీరూ కష్టమే..
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1,053.60 (8.26 టీఎంసీల) అడుగులే ఉంది. ఇటీవల రెండు రోజులు భారీగా వర్షాలు కురిసినా వరద నీరు 10-15 వేల క్యూసెక్కులను మించి రాలేదు. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కింద ఆరు జిల్లాల్లో స్థిరీకరించిన 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీకే సరిపోతోంది. ఎండ వల్ల ఆవిరి, లీకేజీలు కలుపుకుంటే ఏడాదికి 5 టీఎంసీలు పోతుంది. ప్రస్తుతం 8.26 టీఎంసీలే ఉండటంతో ఆ నీటితో ఆయకట్టుకు నీరందించడం కుదరదు. కనీసం తాగునీటి అవసరాలు కూడా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై
ఆధారిత ప్రాజెక్ట్‌లు, ఆయకట్టు వివరాలు..
పథకం ఎకరాల్లో
శ్రీరాంసాగర్ ఒకటో దశ 9,68,640
శ్రీరాంసాగర్ రెండో దశ 4,40,000
ఇందిరమ్మ వరద కాలువ 2,20,000
సదర్‌మట్ ఆనకట్ట 12,000
కడెం ప్రాజెక్ట్ 68,000
అలీసాగర్ ఎత్తిపోతలు ----
గుత్ప ఎత్తిపోతలు ----
హన్మంతరెడ్డి పథకం 11,600
నిజామాబాద్‌లోని 14 ఎత్తిపోతలు 34,948
ఆదిలాబాద్‌లోని 19 ఎత్తిపోతలు 30,417
మొత్తం 17,85,605
ఎస్సారెస్పీ నీటి నిల్వ సంవత్సరాల వారీగా.. (ప్రస్తుత సమయూనికి)
సంవత్సరం నిల్వ(టీఎంసీల్లో)
2010 71.65
2011 57.72
2012 12.72
2103 90
2014 23.5
2015 8.26