Pipeline repair
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్‌లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు. -
పంట పండేనా..?
దండేపల్లి(మంచిర్యాల) : కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు ఆందోళనకరంగా మారింది. డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించడంతో చాలా మంది రైతులు పంటలు సాగు చేసుకున్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ తరచూ మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరాకు ఆటకం కలుగుతోంది. ఒకోసారి వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతోంది. దీంతో గూడెం ఎత్తిపోతల కింద ఇప్పటికే సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆయకట్టు పరిస్థితి ఇదీ.. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రతి యేటా ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఆయకట్టు కింద ఖరీప్‌లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటారు. కడెం నీటిని రబీ సాగుకు ఇచ్చిన దాఖలాలు తక్కువే. రబీ సీజన్లో చెరువులు మాత్రం నింపుతారు. గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభం అయినప్పటినుంచి మాత్రం ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో, రబీకి డీ1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. రెండోసారీ రబీకి.. కడెం ఆయకట్టు కింద డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని రబీ సాగుకు అందించడం ఇది రెండోసారి. అయితే గత సంవత్సరం ఖరీఫ్‌లో కడెం నీటిని ఆయకట్టు చివరి వరకు అందించారు. ఖరీఫ్ సాగు పూర్తయ్యేనాటికి కడెం ప్రాజెక్టులో 692 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికితోడు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ నుంచి తెచ్చి 2016–17లో రబీకి కూడా డి1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించారు. ఈ సమయంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయి. 2017 ఖరీఫ్‌కు కడెం నీటిని డీ1 నుంచి డి42 వరకు అందించారు. ప్రస్తుత యాసంగికి మాత్రం కడెంలో సరిపడా నీళ్లు లేవు. 685 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో డి1 నుంచి డి22 వరకు రెండు తడుల నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో తీర్మానించారు. ఈనెల 15 నుంచి 23 వరకు మొదటి విడత నీటిని విడుదల చేశారు. రెండో విడత ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేయనున్నారు. డీ30 నుంచి డి42 వరకు మాత్రం గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23 నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత రబీకీ నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఎత్తిపోతల పథకం ఇప్పటికి మూడుసార్లు మరమ్మతులకు గురయ్యింది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంటలు పండుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతుల ఆందోళనలు గూడెం ఎత్తిపోతల నీటిని అధికారికంగా డి30 నుంచి డి42 వరకు ఇవ్వాల్సి ఉంది. అయితే తానిమడుగు వద్ద గల ఎత్తిపోతల పథకం డెలివరీ సిస్టర్న్ వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఖరీఫ్ సమయంలో ఈ గేట్లు ఎత్తితే కడెం నీళ్లు డి1 నుంచి డి42 వరకు వెళ్తుంటాయి. రబీ సమయంలో ఈ గేట్లు మూసి గూడెం ఎత్తిపోతల నీటిని డీ30 నుంచి డి42 వరకు అందిస్తుంటారు. ఈ సమయంలో గేట్ల నుంచి లీకయిన కొద్దిపాటి నీళ్లు ఎగువ ప్రాంతాలైన దండేపల్లి, మామిడిపల్లి వరకు వెళ్లడంతో ఈ ప్రాంత రైతులు రబీలో పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కడెం నీటిని డీ1 నుంచి డి22 వరకు చెరువులు నింపేందుకు విడుదల చేయగా, డీ–30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. మిగిలిన డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28లకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. గూడెం ఎత్తిపోతల నీళ్లు మొదట్లో కొద్ది రోజులు ఎగువకు రావడంతో గత ఏడాది మాదిరి ఈసారి కూడా పంటలు సాగు చేశారు. అయితే ఎత్తిపోతల పైప్‌లైన్ పగిలింది. దానికి మరమ్మతు చేసినప్పటి నుంచి ఎత్తిపోతల నీరు ఎగువకు వెళ్లకుండా పూర్తిగా సీజ్ చేశారు. దీంతో డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28 కింది సుమారుగా 5వేల ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా మారాయి. కొందరు రైతులు సాగు చేసిన పొలాలు నీళ్లందక ఎండుతున్నాయి. అయితే వీటికి తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా ఉన్న గేట్లను ఎత్తితే ఇక్కడి వరకు సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. మళ్లీ నిలిచిన నీటి సరఫరా.. గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23న విడుదల చేశారు. అప్పటినుంచి మూడుసార్లు పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది. దీంతో పైప్‌లైన్ లీకయినప్పుడల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో 6న ఒకసారి, 10న మరోసారి, తాజాగా 28న పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది. -
సింగూరు వరదలో చిక్కుకున్న కార్మికులు
గేట్లు మూసి.. బయటకు తీసుకొచ్చిన అధికారులు పుల్కల్: పైప్‌లైన్ మరమ్మతుల కోసం వెళ్లి సింగూరు వరదల్లో ‘సత్యసాయి’ కార్మికులు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం శివారులో జరిగింది. సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎం.అంజయ్య, జి.లింగం, సురేశ్ మంగళవారం ఉదయం సింగూర్ వరదనీటి ప్రవాహం తగ్గడంతో పైప్హౌస్ (ఇన్ టేక్ వెల్) పరిశీలనకు వెళ్లారు. దెబ్బతిన్న పైపులకు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సింగూర్ వరదనీరు పంప్‌హౌస్ చుట్టూ చేరింది. ఇది గమనించిన కార్మికులు తహసీల్దార్, ఎస్సైకు ఫోన్ ద్వారా తెలిపారు. తహసీల్దార్ శివరాం, వీఆర్వో, పోలీసులు అక్కడికి చేరుకొని కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. నీటి విడుదలను కొంతసేపు నిలిపివేయాలని ప్రాజెక్టు ఏఈ రాములుతోపాటు వారు డీఈని కోరారు. అరుుతే ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఎక్కువున్నందున గేట్లు నిలిపివేస్తే ప్రమాదం జరగొచ్చని ప్రాజెక్టు అధికారులు తహసీల్దార్‌కు తెలిపారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా మంగళవారం సాయంత్రానికి గేట్లు మూసివేసి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వరదనీరు రావడంతో 15 రోజులుగా ప్రాజెక్టు నుంచి నిర్విరామంగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే మట్టంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఈఈ రాములు తెలిపారు. ముందే ఆదేశాలు జారీ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిని 15 రోజులుగా వదలక తప్పదని ఈఈ రాములు తెలిపారు. ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు గ్రామాల్లో దండోరా వేయించి మంజీరా నది నీటి ప్రవాహ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించామన్నారు. అయినప్పటికీ సత్యసాయి కార్మికులు మంగళవారం పంప్‌హౌస్ వద్దకు వెళ్లారని ఈఈ రాములు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఆరు గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, మధ్యాహ్నం తర్వాత కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు 4 గేట్లను మూసివేశామని ఈఈ రాములు తెలిపారు. -
ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన సీవరేజ్ పైప్‌లైన్ మరమ్మతుల నిమిత్తం ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు. - తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్మీనార్ల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతించరు. - ఈ మార్గంలో రాకపోకలు సాగించే సాధారణ ట్రాఫిక్‌ను సైతం కుడి వైపు ఉన్న రోడ్ మీదుగానే పంపిస్తారు. - రవీంద్రభారతి వైపు నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా మళ్లిస్తారు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు సచివాలయాలకూ తెలుగుతల్లి చౌరస్తా నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.