సింగూరు వరదలో చిక్కుకున్న కార్మికులు
గేట్లు మూసి.. బయటకు తీసుకొచ్చిన అధికారులు
పుల్‌కల్: పైప్‌లైన్ మరమ్మతుల కోసం వెళ్లి సింగూరు వరదల్లో ‘సత్యసాయి’ కార్మికులు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం పోచారం శివారులో జరిగింది. సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎం.అంజయ్య, జి.లింగం, సురేశ్ మంగళవారం ఉదయం సింగూర్ వరదనీటి ప్రవాహం తగ్గడంతో పైప్‌హౌస్ (ఇన్ టేక్ వెల్) పరిశీలనకు వెళ్లారు.
దెబ్బతిన్న పైపులకు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సింగూర్ వరదనీరు పంప్‌హౌస్ చుట్టూ చేరింది. ఇది గమనించిన కార్మికులు తహసీల్దార్, ఎస్సైకు ఫోన్ ద్వారా తెలిపారు. తహసీల్దార్ శివరాం, వీఆర్వో, పోలీసులు అక్కడికి చేరుకొని కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. నీటి విడుదలను కొంతసేపు నిలిపివేయాలని ప్రాజెక్టు ఏఈ రాములుతోపాటు వారు డీఈని కోరారు. అరుుతే ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఎక్కువున్నందున గేట్లు నిలిపివేస్తే ప్రమాదం జరగొచ్చని ప్రాజెక్టు అధికారులు తహసీల్దార్‌కు తెలిపారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఫలితంగా మంగళవారం సాయంత్రానికి గేట్లు మూసివేసి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వరదనీరు రావడంతో 15 రోజులుగా ప్రాజెక్టు నుంచి నిర్విరామంగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే మట్టంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఈఈ రాములు తెలిపారు.
ముందే ఆదేశాలు జారీ
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిని 15 రోజులుగా వదలక తప్పదని ఈఈ రాములు తెలిపారు. ఈ విషయం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో పాటు గ్రామాల్లో దండోరా వేయించి మంజీరా నది నీటి ప్రవాహ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించామన్నారు. అయినప్పటికీ సత్యసాయి కార్మికులు మంగళవారం పంప్‌హౌస్ వద్దకు వెళ్లారని ఈఈ రాములు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఆరు గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, మధ్యాహ్నం తర్వాత కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు 4 గేట్లను మూసివేశామని ఈఈ రాములు తెలిపారు.