టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి

Published Wed, Jun 21 2023 1:40 AM | Last Updated on Wed, Jun 21 2023 2:00 PM

రోహు చేపపిల్లలు   - Sakshi

రోహు చేపపిల్లలు

నారాయణపేట: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి రెండు సార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అధికారులు ఎటూ తేల్చలేక ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. మత్య్సకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్‌ దిశానిర్దేశంతో జిల్లా మత్య్సశాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధంచేసి టెండర్లకు పిలుపునిచ్చింది. కానీ ఎవరూ చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఽనిర్ణయించిన ధరలకు వ్యాపారస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష నియమించిన టెండర్ల కమిటీ చైర్మన్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, మెంబర్‌, కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి రానాప్రతాప్‌ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను ఈ ప్రొక్య్రూట్‌మెంట్‌ను ఈనెల 12న ఓపెన్‌ చేసి చూడగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా మత్య్స శాఖ అధికారులు పంపించినట్లు తెలుస్తోంది.

గడువు పెంచినా..
చేపపిల్లలను సరఫరా చేసేందుకు గతనెల 5న బిడ్‌ కాలింగ్‌ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్‌ డాక్యుమెంట్‌ను గతనెల 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు తొలిసారిగా మే 30 గడువు విధించారు. అప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో మరోసారి గడువును జూన్‌ 12వరకు పెంచింది. అయినప్పటికి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం టెండర్లను ఓపెన్‌ చేయడంతో స్పష్టమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చేప పిల్లలను పంపిణీ చేయలేమని బహిరంగంగానే కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధరకు గిట్టుబాటు కాదనే ముందుకు రావడంలేదని సమాచారం.

ధరలు పెరిగేనా.. టెండర్లు అయ్యేనా?
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాక కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ధరలు పెరుగుతాయనేది కష్టమే అనిపిస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ట్రాన్స్‌ఫోర్ట్‌ ఖర్చులతో పాటు విత్తనోత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపపిల్లల వ్యాపారస్థులు ఏకమై ఎక్కడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచకపోతే సకాలంలో టెండర్లు అయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది.

రూ.1.78 కోట్లతో ఆహ్వానం..
ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. పెద్దసైజు చేపపిల్లలు (80–100 ఎంఎం) 81.03 లక్షల చేపలకు గాను రూ.1.22 కోట్లు నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న వారు బొచ్చ40 శాతం, రోహు 50 శాతం, మ్రిగాల 10శాతం చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చేపపిల్లలకు (45–40 ఎంఎం) ధర రూ.56.17 లక్షలు నిర్ణయించి టెండర్లకు పిలిచింది. అయితే టెండర్లు వేసే వ్యాపారస్తులు 106.29 లక్షల చేపపిల్లలను (బొచ్చ 35శాతం, రోహు 35శాతం, బంగారుతీగ 30శాతం చొప్పున) సరఫరా చేయాల్సి ఉంటుంది.

టెండర్లు వేయలేదు..
చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆన్‌లైన్‌లో టెండర్లు వేసేందుకు ఈనెల 12తో గడువు ముగిసింది. అయితే టెండర్లు ఎవరూ వేయలేదు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – రానాప్రతాప్‌,

జిల్లా మత్య్సశాఖ అధికారి, నారాయణపేట

2020 నుంచి చేప పిల్లల ధరలు ఇలా..
చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో జిల్లాలోని 590 చెరువులు, మూడు రిజార్వాయర్‌లో వదిలేందుకు కావాల్సిన 1.60 కోట్ల చేపపిల్లల(సీడ్స్‌)ను రూ. 96.10 లక్షలతో కై కలూరి నుంచి కోనుగోలు చేసింది. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ. 1.04,000 చొప్పున 40లక్షలు కొనుగోలు చేయగా, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు 45,786 చొప్పున 1.20 కోట్లు కొనుగోలు చేసింది.

● 2021లో సంవత్సరంలో 1.84 కోట్ల చేప పిల్లలను చేసేందుకు టెండర్లు పిలువగా వనపర్తి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ముందుకు వచ్చి రూ.1.49 కోట్లకు టెండర్లు వేసి సరఫరా చేశారు. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ.1.58,000 చొప్పున 43లక్షల చేప పిల్లలకు గాను రూ.67,46,600లు, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు.. లక్ష పిల్లలకు 58వేల చొప్పున రూ1.41 కోట్ల చేప పిల్లలకుగాను రూ. 82,24,980లకు సరఫరా చేశారు.

● 2022 లో టెండర్లు వేసిన వారిలో ఎల్‌–1 తప్పుకోవడంతో మిగతా నలుగురు కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. చేపపిల్లలను పంపిణీ చేసిన వారిలో పద్మనాగ భూని నాగ వెంకటసూర్య సతిస్‌ రాజ్‌కుమార్‌ కై కలూరు (ఏపి) 35–40 ఎంఎం రూ.43,800, 80–100 ఎంఎంకు రూ.1,33,650కు ఎల్‌2గా టెండర్‌ దక్కించుకున్నారు. అయితే టెండర్లలో పాల్గొన్న మరో ముగ్గురు సైతం రాజ్‌కుమార్‌తో కలసి (అక్వా స్పార్క్‌ హచారీ నర్వ మండలం ఉందేకోడ్‌కు చెందిన వ్యాపారి, డి.శివకుమార్‌ ఆత్మకూర్‌ మండలం అరెపల్లికి చెందిన వ్యాపారి) చేప పిల్లలను పంపిణీ చేశారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement