రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
Published Tue, Aug 29 2017 2:07 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM
- 77 రిజర్వాయర్లు... 20 వేల చెరువుల్లో వేసేందుకు ఏర్పాట్లు
- మొత్తం 69.66 కోట్ల చేపలను పంపిణీ చేస్తాం: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో చేప పిల్లలను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామపంచాయతీ చెరువుల్లో మొత్తం 69.66 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నామని చెప్పారు. గతేడాది రిజర్వాయర్లు, ప్రభుత్వ చెరువుల్లో 29 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పున రావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరుతూ లేఖలు రాయనున్నట్లు వివరించారు.
చేపల విడుదల వీడియో చిత్రీకరణ.. : అవసరమైన చేప పిల్లలను ఈ–ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కొనుగోలు చేసినట్లు మంత్రి తలసాని చెప్పారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేసే ప్రక్రియను వీడియో చిత్రీకరణ జరపాలని, నిబంధనల మేరకు లేని చేపపిల్లలను తిరస్కరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మత్స్యశాఖలో సరిపడా సిబ్బంది లేనందున చేపపిల్లల పంపిణీలో పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. సబ్సిడీపై వాహనాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు.
త్వరలో నూతన మత్స్య సొసైటీలు..
అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించి 31 జిల్లాలకుగాను నూతన మత్స్య సొసైటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3,831 సొసైటీల్లో 2,79,871 మంది సభ్యులు ఉన్నారన్నారు. గొర్రెల పంపకందారులకు ఇప్పటివరకు 14.76 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. 100 సంచార పశువైద్య వాహనాలను త్వరలోనే సీఎంతో ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో లబ్ధిదారులు గొర్రెలను విక్రయించినట్లు ఫిర్యాదు రావడంతో వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొర్రెల కొనుగోలుకు టెండర్లు పిలవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.
Advertisement