గొర్రెలు, చేపల పంపిణీ కథ తేల్చండి | Chief Minister Revanth Reddy in review of Animal Husbandry Department | Sakshi
Sakshi News home page

గొర్రెలు, చేపల పంపిణీ కథ తేల్చండి

Published Wed, Mar 6 2024 4:41 AM | Last Updated on Wed, Mar 6 2024 4:41 AM

Chief Minister Revanth Reddy in review of Animal Husbandry Department - Sakshi

విజిలెన్స్‌ విచారణకు సీఎం ఆదేశం

ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు

ఏప్రిల్‌ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాలకు వెయిటేజీ

అన్ని మండలాల్లోనూ వెటర్నరీ హాస్పిటల్‌ ఉండాలి

పశు సంవర్థక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్‌ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు, లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు.

విజిలెన్స్‌ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఏవైనా అవినీతి, అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే, ఆ ఫైలును అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

వివరాలు ఎందుకు సేకరించలేదు?
ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గురించి సీఎం మాట్లాడుతూ శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా అని పశు, మత్స్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ.3955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్సీడీసీ) రెండో విడత రుణం ఇవ్వకుండా ఎందుకు నిలిపివేసిందని అధికారులను నిలదీశారు.

అప్పటికే ఈ పథకంపై కాగ్‌ అభ్యంతరాలను లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిన నేపథ్యంలోనే ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు బదులిచ్చారు. తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడత కింద 85,488 మంది తమ వాటాగా చెల్లించిన దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు తమ వాటా ఇవ్వలేదన్నారు.

మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ సేవలు కొనసాగించాలి 
పాడి రైతులకు ఒక లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఏప్రిల్‌ నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఈ ప్రోత్సాహకాన్ని నిలిపివేసిందని, ఆ మొత్తం బకాయిలు రూ.203 కోట్లు పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ప్రతి నెలా గ్రీన్‌ చానల్‌ ద్వారా ఈ ప్రోత్సాహకాలు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్‌ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల నియామకాల్లో ఈ విభాగంలో ఏళ్లతరబడి పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్య మంత్రి అధికారులకు సూచించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి,  సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్‌ సీఎస్‌ ఆధర్‌ సిన్హా, డెయిరీ డైరెక్టర్‌ లక్ష్మి, ఫిషరీస్‌ డైరెక్టర్‌ గోపి సమావేశంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement