అక్రమమైనా జనావాసాల జోలికి వెళ్లం: రంగనాథ్‌ | Hydra Commissioner Ranganath Answers to questions: Telangana | Sakshi
Sakshi News home page

అక్రమమైనా జనావాసాల జోలికి వెళ్లం: రంగనాథ్‌

Published Wed, Oct 2 2024 5:04 AM | Last Updated on Wed, Oct 2 2024 5:47 AM

Hydra Commissioner Ranganath Answers to questions: Telangana

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ‘మీతో సాక్షి’ సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రత్యేక విభాగం కార్యకలాపాలపై సామాన్యులను అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ నుంచి, ఏ బుల్డోజర్‌ వస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ‘సందట్లో సడేమియా‘లా నోటీసులు, బెదిరింపులతో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మీతో సాక్షి’ సామాన్యుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. వాట్సాప్‌ ద్వారా అనేకమంది పంపించిన ప్రశ్నలను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ దృష్టికి తీసుకువెళ్లింది. వీరిలో అత్యధికులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరడం గమనార్హం. కాగా ఆయా ప్రశ్నలకు రంగనాథ్‌ చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి..

ప్రకృతిని రక్షిస్తేనే.. మన హైదరాబాద్‌కు భవిష్యత్తు. ప్రకృతిని కాపాడే దిశగా ప్రభుత్వం, మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలే గతంలోనూ ఉన్నాయి. చెరువులు, కుంటల్లో పట్టా ల్యాండ్‌లు ఉంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని చట్టంలో ఉంది. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు అన్ని అనుమతులు ఇచ్చేశారు. దీంతో నాతో పాటు అనేక మంది మధ్య తరగతికి చెందినవారం ఈఎంఐ లోన్లతో ఇళ్లు కట్టుకున్నాం. వాటిని ఇప్పుడు మీరు కూల్చేస్తామంటే ఎలా? తొలుత మాకు అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ శిక్షించి, ఆ తర్వాత మా వద్దకు రావడం న్యాయం కదా!  – జయంత్‌నాథ్, ముషీరాబాద్‌

జవాబు: అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా సామాన్యుడికి అండగా నిలవాలనే చెప్తోంది. అవసరమైన, చెల్లుబాటు అయ్యే అన్ని అనుమతులు ఉన్న కమర్షియల్‌ భవనాలనూ కూల్చం. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటి పైనే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా నిర్మించిన లేదా అనుమతులు రద్దు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తాం. ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్‌ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై మాత్రం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఆ అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేదా సంబంధిత శాఖకు నివేదిస్తాం. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్‌ ఖరీదు చేసుకునే ముందు పూర్తి వివరాలు సరిచూసుకోండి.

హైదరాబాద్‌ నగరాన్ని కాపాడేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు భేష్‌. కానీ పెద్దలకు, పేదలకు ఒకే న్యాయం అమలు చేయాలి. పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు. పేదలకు మాత్రం నోటీసు లేకుండానే కూల్చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గంచెరువు, రామాంతపూర్‌ చెరువు విషయంలో అదే జరిగింది. పేదలు లక్షల రూపాయలు వెచ్చించి కోర్టులకు వెళ్లలేరు. పెద్దలు మాత్రం వెళ్లి తమ అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నారు. అందరికీ ఒకే న్యాయం మీరు అమలు చేయగలరా?
– జీవానందరెడ్డి, బంజారాహిల్స్‌ 

జవాబు: హైడ్రా ఎలాంటి నోటీసులూ ఇవ్వదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మేం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. హైడ్రా పేద ప్రజల వైపే ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎన్‌–కన్వెన్షన్, జవహర్‌నగర్‌ చెరువు వద్ద ఇదే సూత్రాన్ని పాటించాం. సరైన అనుమతులు లేకుండా నిర్మించిన ఎన్‌–కన్వెన్షన్‌ను కూల్చినప్పటికీ.. అదే చెరువు కట్టపై మరోపక్క ఉన్న పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదు. జవహర్‌నగర్‌ చెరువు దగ్గర ఉన్న నివాసాలను కూడా ముట్టుకోలేదన్నది గమనించాలి.

మేడ్చల్‌లోని గాలిల్లాపూర్‌ గ్రామానికి సంబంధించి ఎఫ్‌టీఎల్స్, బఫర్‌ జోన్లపై అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిపై స్పష్టత ఇవ్వగలరా? – శ్రీనివాస్‌
జవాబు: మీ గ్రామంలో ఉన్న చెరువు, కుంట పేరు చెప్తే అవకాశం ఉంటుంది. లేదంటే స్థానిక ఇరిగేషన్‌ అధికారులను సంప్రదించినా, లేదా హెచ్‌ఎండీఏకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించినా మీకు సమాచారం లభిస్తుంది.

శంషాబాద్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యా దులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గత నెల్లో హైడ్రాకు ఫిర్యాదు చేశాం. దానిపై త్వరగా చర్యలు తీసుకోండి. – ప్రకాశ్‌కుమార్, శంషాబాద్‌

జవాబు: హైడ్రాకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం అతికొద్ది మందితోనే పని చేస్తున్నాం. ఫిర్యాదులు మాత్రం దాదాపు ఐదు వేలకు పైగా వచ్చాయి. ఈ కారణంగానే విచారణ పూర్తి చేసి, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. 

జల్‌పల్లి పెద్ద చెరువులో అక్రమంగా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. మిషన్‌ భగీరథకు సంబంధించిన వాటర్‌ట్యాంక్‌ను రోడ్డుకు అడ్డంగా కట్టారు. దీన్ని ఆధారంగా చేసుకునే ఓ కంపెనీ రోడ్డును ఆక్రమిస్తోంది. వీటిపై చర్యలు తీసుకోండి. – పేరు గోప్యంగా ఉంచాలని కోరిన వ్యక్తి

జవాబు: హైడ్రా బృందాన్ని త్వరలో ఆ ప్రాంతానికి పంపిస్తాం. పెద్దచెరువుతో పాటు శ్రీరామ కాలనీ చుట్టు పక్కల ప్రాంతాలపై అధ్యయనం చేయిస్తాం. ఎలాంటి ఆక్రమణలు, అతిక్రమణలు ఉన్నా చర్యలు తీసుకుంటాం. 

కొందరు రాజకీయ నాయకులకు చెందిన విద్యాసంస్థల్ని కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీ దృష్టిలో అవి అక్రమ నిర్మాణాలు కావా?  – రాజేంద్రకుమార్, నారాయణగూడ 
జవాబు: అలాంటి అక్రమ నిర్మాణం ఎవరిదైనా ఉపేక్షించం. అయితే ఇల్లు అనేది ఓ కుటుంబానికి సంబంధించిన అంశం. వాణిజ్య సము దాయం కొందరికే సొంతమైన వ్యవహారం. కానీ విద్యా సంస్థల విషయం అలా కాదు... దాని కూల్చివేత ప్రభావం వందలు, వేల మంది విద్యార్థులు, వారి భవిష్యత్తుపై ఉంటుంది. అందువల్ల వీటిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.

బతుకులకుంట చెరువు సమీపంలో ఆరేళ్ల క్రితం ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా. ఆ సమయంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లకు సంబంధించిన గుర్తులు లేవు. అది పక్కా పట్టా భూమి అని చెప్పి అమ్మారు. ఇద్దరు ఆడపిల్లలపై చదువులు, పెళ్లిళ్లు దృష్టిలో ఉంచుకుని ఆ ప్లాట్‌ కొన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? – నాగిరెడ్డి, హయత్‌నగర్‌ 

జవాబు: ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలోనూ పట్టా భూములు ఉంటాయి. అయితే అది ఏ తరహా పట్టా అన్నది తెలుసుకోవాలి. కొన్ని భూముల్ని కేవలం వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించాలి. ఆయా పట్టాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 

అమీన్‌పూర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగు నెలల క్రితం ఓ ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్నా. బంధంకొమ్ము చెరువు ప్రాంతంలో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అది అక్రమ కట్టడమా? సక్రమ కట్టడమా? ఎలా తెలుసుకోవాలి? – పేరు వెల్లడించని వ్యక్తి

జవాబు: అమీర్‌పూర్‌ ప్రాంతంలోనే కాదు.. ఎక్కడ స్థిరాస్తి కొనుగోలు చేస్తు న్నా 3 అంశాలు సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చిన అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? అనేది చూసుకోండి. అమీన్‌పూర్‌లో కొన్ని నిర్మాణాలకు హెచ్‌ఎండీఏకు బదులు పంచాయతీ సెక్రటరీ, ఆర్‌ఐలు అనుమతులు మంజూరు చేశారు. వీటిని గతంలోనే రద్దు చేసిన ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లండి.

మేము 2010లో ప్లాట్‌ కొనుక్కుని అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇప్పుడు మీ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వస్తుందంటూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారు. వాస్తవానికి మా ఇంటి పరిధిలో ఎలాంటి చెరువు, కుంట ఉన్న ఆనవాళ్లు లేవు. ఎప్పుడు వరద, నీళ్లు రాలేదు. కానీ రికార్డుల్లో కుంట ఉందని, ఎఫ్‌టీఎల్‌లో మీ ఏరియా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? – ఎం.సంజీవరెడ్డి, బోడుప్పల్‌
   జవాబు:  ప్రస్తుతం ఆ ప్రాంతంలో కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. అందుకే రికార్డుల్లో జలవనరు ఉన్నట్లు నమోదైంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, అందులో నివాసం ఉంటున్న ఇల్లు చెరువులో ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. అలాంటి వాటి జోలికి వెళ్లం. వీటిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతాం. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటల్ని పూర్తి స్థాయిలో పరిరక్షణ చేయడానికే కట్టుబడి ఉన్నాం. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు దిగితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.

దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకు కూల్చట్లేదు? ఇప్పుడు మూసీ పరీవాహక ప్రాంతంపై ఎందుకు పడ్డారు? – పేరు చెప్పని ‘సాక్షి’ పాఠకుడు
    జవాబు: మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న సర్వే, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా ఇప్పటివరకు ఎవరికీ, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దుర్గం చెరువు సహా నగరంలోని 11 చెరువులను పునరుద్ధరించి, పరిరక్షించాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై కోర్టు అడ్వకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు ఆయా చెరువుల పరిధిలో నివసిస్తున్న వేల మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ 11 చెరువుల అంశం ప్రస్తుతం
కోర్టు పరిధిలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement