అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: కేసీఆర్ | illegal constructions will demolish, says cm kcr | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: కేసీఆర్

Published Sun, Sep 25 2016 2:50 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: కేసీఆర్ - Sakshi

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: కేసీఆర్

  • నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం: సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
  •  హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ నిర్మాణాలు
  •  వర్షాలు తగ్గాక కూల్చివేత చర్యలు చేపడతాం
  •  అక్కడున్న పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తాం
  •  అక్రమ కట్టడాల సమాచారమిస్తే 10 వేల పారితోషికం
  •  భవన నిర్మాణాలు, ఉల్లంఘనలపై ట్రిబ్యునల్ యోచన
  •  ఐదారేళ్లలో విశ్వనగరం చేసి చూపిస్తామని వెల్లడి
  •  సాక్షి, హైదరాబాద్
     హైదరాబాద్‌లో అక్రమ కట్టడా లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంత పెద్దవ్యక్తికి సంబంధించిందైనా కూల్చివేసేందుకు వెనుకాడేది లేదని పేర్కొన్నారు. నగరంలోని నాలాలు, కాల్వలపై 28 వేల అక్రమ కట్టడాలున్నాయని, వాటన్నింటినీ  కూల్చివేస్తామని ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చర్యలు చేపడతామని చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘24 సర్కిళ్లకు 24 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తాం. వీరికి సాయంగా పోలీస్ టీమ్‌లుంటాయి. అక్రమ కట్టడాలకు సంబంధించిన సమాచారం ఇచ్చే ప్రజలకు జీహెచ్‌ఎంసీ రూ.10 వేల నగదు బహుమతి కూడా ఇస్తుంది. వారి పేర్లను రహస్యంగా ఉంచుతుంది’’ అని ప్రకటించారు.

    ‘‘గతంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 390 కిలోమీటర్ల పొడవైన నాలాలుంటే మూసీలోకి వెళ్లే 173 కిలోమీటర్ల నాలాలు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. వీటన్నింటినీ తొలగిస్తాం. అందులో పేద ప్రజలుంటే వారికి ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఇస్తుంది. నగర శివార్లలో పేదల ఇళ్లకు సరిపడే స్థలాలను ప్రభుత్వం సేకరించింది. వారందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని సీఎం కోరారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే అక్రమ కట్టడాల కూల్చివేతకు సహకరించాలని, ధర్నాలు, ఆందోళనలతో రాద్ధాంతం చేయొద్దని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలోనే నగరానికి ఈ దుర్గతి పట్టిందని, 28 వేల అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చింది వారేనని మండిపడ్డారు. సంస్కారహీనంగా మాట్లాడవద్దంటూ వారికి హితవు పలికారు. భవనాల నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే యోచన ఉందని, న్యాయ శాఖతో సంప్రదించి సోమవారం నాటి కేబినేట్‌లో చర్చిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వానలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్షించారు.

    దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలను గుణపాఠంగా స్వీకరించి, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అన్నారు. హైదరాబాద్ పరిధిలో రోడ్లన్నీ మరమ్మతులు చేసేందుకు జీహెచ్‌ఎంసీకి రూ.300 కోట్లు లేదా రూ.400 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. రోడ్లను శాశ్వతంగా అధునీకరించేందుకు నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు చేపడుతామన్నారు. సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, అందుకు అవసరమైన రూ.20 వేల కోట్లు రుణంగా ఇప్పించేందుకు జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని వెల్లడించారు.
     
     గోదావరికి వరద ముప్పు
     మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరికి వరద ముప్పు పొంచి ఉందని సీఎం హెచ్చరించారు. ‘‘గైక్వాడ్ ప్రాజెక్టు దిగువన విపరీతమైన వర్షాలు పడుతున్నందున ఎస్సారెస్పీకి వరద పోటెత్తింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు సైన్యం, హెలికాప్టర్లు సన్నద్ధంగా ఉన్నాయి. సెక్రెటేరియట్‌తో పాటు ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంటాయి’’ అని వివరించారు.
     
     అధికారులకు సెలవులు రద్దు
     వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు సీఎం ప్రకటించారు. వచ్చే వారంరోజుల పాటు అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్కడివారక్కడే తమ నియోజకవర్గాల్లో ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు.
     
     ప్రాజెక్టులకు జలకళ శుభసూచకం
     రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు జలకళ రావటం శుభసూచకమని, ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ‘‘మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. ఎస్సారెస్పీకి 75 టీఎంసీల నీరు చేరింది. దాదాపు 4.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహముంది. సింగూరు నిండింది. దాదాపు 1.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయం వరకు నిండే అవకాశముంది. ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టులన్నింటా నీళ్లొచ్చాయి. కృష్ణా పరిధిలోని శ్రీశైలంలో నీటి నిల్వ 172 టీఎంసీలు దాటింది. దాని గరిష్ఠ సామర్థం 215 టీఎంసీలు. 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మహాబలేశ్వరంలో 20 సెం.మీ.ల వర్షపాతం ఉంది. అలమట్టి, నారాయణపూర్ నిండుకుండలా ఉన్నాయి. శ్రీశైలం నిండి నీరు పొంగిపొర్లనుంది. నాగార్జునసాగర్ ఒక్కటి మినహా రాష్ట్రంలోని అన్ని భారీ ప్రాజెక్టుల్లో గణనీయంగా నీరు వచ్చి చేరింది. సాగర్ కూడా  నిండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు.
     
     మరో రెండేళ్లు కరువు రాదు
     రాబోయే రెండు సంవత్సరాలపాటు కరువు రక్కసి తెలంగాణ వైపు చూసే ప్రసక్తి లేదని సీఎం అన్నారు. మరో రెండేళ్లు సాగునీరు, తాగునీటికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి లేదని, పంటలు బాగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలు అందించబోతుందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో 46 వేల చెరువుల్లో 25 వేలపైచిలుకు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 19 వేల చెరువుల్లో 80 శాతం నీరు వచ్చింది. మిగిలిన వాటిలో 25 శాతం నుంచి 50 శాతం నీరుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రెండో పంట బంపర్ క్రాప్ వచ్చే ఆస్కారం ఉంది’’ అని అన్నారు.
     
     వచ్చే అయిదేళ్లు వర్షాలే
     రాష్ట్రంలో రాబోయే అయిదారేళ్లు ఇదే తరహాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు అంచనా వేస్తున్నాయని సీఎం చెప్పారు. ‘‘గడిచిన దశాబ్దంలో ఆరేడేళ్లు వరుస కరువులతో అల్లాడాం. ఇప్పుడు పర్యావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణ కేంద్రాల అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా వర్షాలు కురుస్తాయి. రాబోయే అయిదారేళ్లు చక్కటి వర్షాలు కురుస్తాయి. ఇది శుభసూచకం. ఇప్పటివరకు ఎల్‌నినోతో దుర్భిక్ష పరిస్థితులు చూశాం. వచ్చేది లానినో పరిణామాలు. మరో 15, 20 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 12 నుంచి 22 వరకు రుతుపవనాలు తిరుగుముఖం పట్టే సమయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది’’ అని వివరించారు.
     
     వరద నష్టం తక్కువే..
    వర్షాలతో చాలా తక్కువ నష్టం వాటిల్లిందని సీఎం ప్రాథమిక అంచనాలను వెల్లడించారు. ‘‘పంటలు ఎక్కడా కొట్టుకుపోలేదు. కొన్నిచోట్ల పొలాల్లో నీటి నిల్వ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 71 చెరువులు కట్టలు తెగినయి. అవన్నీ చిన్న చెరువులు. మిషన్ కాకతీయ పనులు చేయనివే తెగినవి. మేజర్ చెరువులేమీ తెగలేదు. దాదాపు 500 పంచాయతీరాజ్ రోడ్లు కొట్టుకుపోయాయి. 56 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 8 చోట్ల జాతీయ రహదారులపై నీరు పోతోంది. అయిదుగురు చనిపోయారు. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం. తగిన సాయం అందించాలని కోరుతాం. 200 వైద్య ఆరోగ్య బృందాలు రంగంలోకి దింపాం. మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
     
     అసాధారణ వర్షంతోనే అసౌకర్యం
     అసాధారణ వర్షం కురిసినందుకే హైదరాబాద్‌లో ప్రజలకు అసౌకర్యం తలెత్తిందని సీఎం చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో విభిన్నమైన పరిస్థితి ఉంది. సెప్టెంబర్‌లో సాధారణంగా 84 మి.మీ.ల వర్షపాతం కురియాల్సి ఉంటే.. 462 మి.మీ.ల వర్షం కురిసింది. 1908 తర్వాత.. దాదాపు శతాబ్దం తర్వాత ఇంత అసాధారణ వర్షం కురియడం ఇదే మొదటిసారి. 448 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రజలకు కొంత అసౌకర్యం ఎదురైంది. చెన్నై, ముంబైలలో భారీ వరాల్షు వస్తే ఏం జరిగిందో మనం చూశాం. అంతకు మించి భయంకరమైన సమస్యలేమీ మనకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బందులు తలెత్తాయి. కానీ కొంపలంటుకు పోయినట్లుగా మీడియా ప్రచారం చేయటం సరైంది కాదు. ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ప్రచారం చేయటం సరైంది కాదు. అతిగా చేసి చూపించవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
     
     అప్రమత్తంగా ఉన్నాం
     హైదరాబాద్‌లో కూలిపోయే ప్రమాదమున్న భవనాలను కూల్చివేయటంతో ప్రాణనష్టం తప్పిందని, అందుకే సిటీలో ఒక్క జంతువు కూడా చనిపోలేదని సీఎం పేర్కొన్నారు. ‘‘సైన్యం కూడా అందుబాటులో ఉంది. దాదాపు 400కుపైగా భవనాలు కూల్చివేశారు. మరో వంద భవనాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. త్వరలోనే వాటిని తొలిగించే ఏర్పాట్లు చేస్తాం. కీలకమైన సమయంలో రేయింబవళ్లు శ్రమించిన హైదరాబాద్‌లోని మంత్రులు, మేయర్, మున్సిపల్ మంత్రి, అధికారులను అభినందిస్తున్నా. రాంగోపాల్‌రావుపేట పోలీస్ స్టేషన్‌ను సైతం కూల్చివేయాలని సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. వరంగల్‌లో పది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 3 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఒకట్రెండు చోట్ల ఆ పరిస్థితి వచ్చింది. వారందరికీ భోజన వసతి కల్పించాం. ప్రాణనష్టం, విపత్కర పరిస్థితులు రాకపోవటం మన అదృష్టం’’ అని వ్యాఖ్యానించారు.
     
     విశ్వనగరంపై అవివేకపు మాటలు
     ‘‘విశ్వనగరంపై కొందరు ఎద్దేవా చేసినట్లు మాట్లాడుతున్నారు. అవి అవివేకపు మాటలు. విశ్వనగరాలు తెల్లారేసరికే తయారు కావు. రాత్రికి రాత్రి చూమంతర్ అంటే తయారు కావు. అలా అవుతాయని అనుకోవటం అవివేకం’’ అని సీఎం అన్నారు. ‘‘ఈ అనుభవాలను సవాలుగా స్వీకరిస్తున్నాం. ప్రణాళిక ప్రకారం రాబోయే ఐదారేళ్లలో విశ్వనగరం చేసి చూపిస్తాం. నాలాలు, మురికి నీటి కాలువలపై ఉన్న 28 వేల కట్టడాలు దుర్మార్గం, దాష్టీకానికి నిదర్శనం. గత పాలకుల హయాంలో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా వీటిపై ఉన్నాయి.

    ఇవన్నీ సరిదిద్దాలంటే రూ.11 వేల కోట్లు కావాలి. తెల్లారేసరికే ఈ పనులు కావు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలైంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యలు మొదలయ్యాయి. దాదాపు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల రుణం కావాలి. దాదాపు ఐదారేళ్లు శ్రమిస్తే తప్ప ఈ పనులు కావు. హైదరాబాద్‌లో 90 వేల చదరపు మీటర్ల రోడ్లు ఉంటే.. అందులో పది శాతం మాత్రమే దెబ్బతిన్నాయి. నిజాంపేట ప్రాంతంలో కొన్ని కాలనీల్లో సెల్లార్‌లు నీటిలో మునిగాయి. ఆ కాలనీలో మధ్యతరగతి కుటుంబాలున్నాయి. నీటిలో మునిగిన విద్యుత్ మీటర్లను ప్రభుత్వమే మారుస్తుంది’’ అని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement