
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో మహానగరం అతలాకుతలమైంది. ముంపునకు నాలాల ఆక్రమణే కారణమంటూ ‘సాక్షి’లో ఈనెల 17న ‘ఈ పాపం ఎవరిది..!?’ శీర్షిక ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వరంగల్ మహానగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో కథనం ద్వారా సవివరంగా వెల్లడైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్‌లో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్...
మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ముంపు కాలనీల్లో పరిశీలించారు. ఆ తర్వాత నిట్‌లో సమీక్ష చేసిన సందర్భంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించడం దసరా లోపు పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనంతో 435 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు కేటీఆర్‌కు వివరించగా.. వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం హన్మకొండ నయీంనగర్‌లోని నాలా వెంట నిర్మించిన వాగ్దేవి కళాశాల నుంచి నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.