
ఆ వర్షం మనకొస్తే..!
⇒ చెన్నై స్థాయిలో కురిస్తే వరద ముప్పు
⇒ కాలం చెల్లిన నాలాలే ప్రధాన సమస్య
⇒ అమలుకు నోచుకోని కీలక సిఫార్సులు
వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై నగరంలో ఇటీవల ఒక రోజులో కురిసిన వర్షం 118 సెం.మీ. ఊళ్లూ ఏళ్లూ ఏకం చేసిన ఆ వర్ష బీభత్సాన్ని తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. మరి హైదరాబాద్ మహా నగరంలో ఆ స్థాయి వర్షం కురిస్తే? అమ్మో... ఇంకేమైనా ఉందా? 2000వ సంవత్సరంలో కురిసిన 24 సెం.మీ. వర్షానికే నగరం ‘మునిగిపోయింది.’ రహదారులు గోదారులయ్యాయి. రోడ్లపై పడవలు తిరిగాయి. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని చెన్నై అనుభవం చెబుతోంది.
సిటీబ్యూరో: నగరంలో ఓ మాదిరి వాన కురిసినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. చిన్న చినుకుకే రహదారులు చిత్తడిగా మారి... రోత పుట్టిస్తున్నాయి. ఏమాత్రం వర్షం కురిసినా వరదలు తప్పడం లేదు. ఫలితంగా ట్రాఫిక్‌తో పాటు జనజీవనమూ స్తంభిస్తోంది. ఇలాంటి ‘సున్నితమైన’ నగరంలో చెన్నైలో కురిసిన స్థాయిలో వర్షం పడితే... ఈ ఊహకే చిగురుటాకులా వణికిపోవాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం నాలాల పరి(దు)స్థితి. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉపకరిస్తున్నాయి. ఉన్న వాటిలో చాలా వరకు పూడుకుపోవడం... మరికొన్ని ఆక్రమణలకు గురికావడంతో మా వల్ల కాదంటూ మ్యాన్‌హోళ్లు మురికినీ, నీటినీ రోడ్లపైకి కక్కేస్తున్నాయి.
నేటి పాలకుల కన్నా నాటి నవాబే మిన్న...
నిజాం నవాబు హయాంలో 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో అప్రమత్తమైన నవాబు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు యుద్ధ ప్రాతిపదికన నాలాల నిర్మాణం ప్రారంభించారు. దాదాపు పదేళ్ల పాటు ప్రణాళికా బద్ధంగా వీటిని నిర్మించారు. ఇప్పటి మన పాలకులకు... నిజాంకు ఉన్న దానిలో కొంతైనా నిబద్ధత కనిపించడం లేదు. 2000వ సంవత్సరం ఆగస్టులో సిటీలో రికార్డు స్థాయిలో 240.5 మిల్లీమీటర్ల వర్షం కురిసి వరదలు ముంచెత్తాయి. ఈ పరిణామాలకు నాలాలే కారణమని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఓ హైపవర్ కమిటీని నియమించి నాలాల అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈమేరకు అధ్యయనం చేసిన కమిటీ కొన్ని కీలక సిఫార్సులు చేసింది. దశాబ్దం దాటినా ఇప్పటికీ ఇవి అమలు కాలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే నగర జీవికి నరకం తప్పడం లేదు. నిజాం కాలంలో నాలాలను గంటకు 12 మిల్లీ మీటర్ల వర్షాపాతాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం వీటిని గంటకు 40 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని సైతం తట్టుకునే స్థాయికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
మ్యాన్‌హోల్స్ రూపంలో మరో ముప్పు...
నగర వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డ్‌లకు చెం దిన మ్యాన్‌హోళ్లతో వర్షాకాలంలో మరో ముప్పు పొం చి ఉంటుంది. శాఖల మధ్య సమన్వయ లోపం... సరైన స్పందన లేని కారణంగా ఏటికేడు రోడ్ల ఎత్తు పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మ్యాన్‌హోళ్ల ఎత్తును పెంచకపోవడంతో అనేక ప్రాంతాల్లో వీటి దగ్గర గోతులు ఉన్నాయి. వర్షాకాలంలో వీటిలో నీరు నిండి గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇవే వాహన చోదకులను ప్రమాదాల బారినపడేలా చేస్తున్నాయి. ఇక, మూతలేని మ్యాన్‌హోళ్లలో పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదు.
ట్రాఫిక్ జామ్‌తో...
వర్షాకాలంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడటానికి వాటర్ లాగింగ్ ఏరియాలు ప్రధాన కారణం. ఇలాం టివి నగర వ్యాప్తంగా 132 ఉన్నాయి. వీటిలో 14 అ త్యంత సమస్యాత్మకమైనవిగా ట్రాఫిక్ అధికారులు తే ల్చారు. ఈ ప్రాంతాల్లో గంటలకొద్దీ నీళ్లు నిలుస్తుండటం తో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఇవీ హైపవర్ కమిటీ సిఫార్సులు
► అత్యవసరంగా నగరంలోని 8 ప్రధాన నాలాలను విస్తరించాలి.
► వాటికి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి.
► నాలాల ఆధునికీకరణకు రూ.1000 కోట్లు కేటాయించాలి.
► నాలాల సగటు వెడల్పు 40 నుంచి 50 మీటర్లు ఉండాలి.
► రానున్న 50 ఏళ్లలో 240 మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్నిసార్లు నమోదైనా ప్రమాదం లేని స్థితిలో నాలాలు విస్తరించాలి.
► నాలాల్లో ఉన్న 6,520 ఆక్రమణలను తొలగించడానికి *53.19 కోట్లు కేటాయించాలి.
సంఖ్యల్లో వాస్తవాలు
►నగరంలోని వాహనాల సంఖ్య: దాదాపు 30 లక్షల పైనే
► రోడ్ల పొడవు: 3,823 కి.మీ.
► నగర విస్తీర్ణంలో రోడ్ల వంతు: 6 శాతం
► వాస్తవంగా ఉండాల్సింది: 13 శాతం
► నగరంలోని నాలాల సంఖ్య: 750
► వీటిలో ప్రధానమైనవి: దాదాపు 71
► నాలాల పొడవు: 2,800 కి.మీ.
► ప్రధాన నాలాలు ఆక్రమణలో ఉన్న ప్రదేశాలు: 2,192
► సిటీలోని మ్యాన్‌హోళ్లు: దాదాపు 2 లక్షలు
► అత్యవసరంగా ఎత్తు పెంచాల్సిన
►మ్యాన్‌హోళ్లు: 149 ప్రాంతాల్లో 726