సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు.
సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment