ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు నాలా మరణాలు?.. కేటీఆర్‌ హెచ్చరించినా.. ప్చ్‌!

Published Wed, Sep 6 2023 7:20 AM | Last Updated on Wed, Sep 6 2023 8:10 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి బాటలు పరుస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో వానలొస్తే.. నాలాలు ఉప్పొంగడం...అందులో పడి ఎవరో ఎవరో ఒకరు చనిపోవడం మామూలైపోయింది. అన్నిరంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నప్పటికీ, మిగతా నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వరద కాలువల్లో పడి ప్రాణాలు పోవడం గుండెల్ని పిండి వేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులకు నూరేళ్లు నిండుతుండటం ఎందరినో కలచివేస్తోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంపేట ప్రగతినగర్‌లో నాలుగేళ్ల పసిబాలుడు మిథున్‌రెడ్డి నాలాలో పడి మృతి చెందితే ఆ పాపం ఎవరిది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేటీఆర్‌ హెచ్చరించినా.. వర్షాల వల్ల ప్రజలు మరణించే పరిస్థితులుండరాదని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ పలు దఫాలుగా అధికారుల్ని హెచ్చరించినా.. దారుణం జరిగిపోయింది. గత మూడేళ్లుగా నాలాల్లో పడి చిన్నారులు మరణిస్తుండటం తొలచివేస్తోంది. రెండేళ్ల క్రితం నేరే డ్‌మెట్‌లో సుమేధ అనే బాలిక మరణించడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

గత ఏప్రిల్‌లో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు లేక సికింద్రాబాద్‌ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి మృతి చెందింది. తాజా ఘటనలోనూ నాలాపై కప్పు సరిగ్గా లేకపోవడం వల్లే బాలుడు అందులో పడి మరణించాడు. స్థానికుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాలాల్లో మరణాలు...

2017 నుంచి నాలాల్లో పడి ఎందరో మరణించారు.

● 2017 ఫిబ్రవరిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో నాలాలోపడి జకీర్‌ అబ్బాస్‌ (2) అనే బాలుడు మరణించాడు.

● 2018 జనవరిలో చందానగర్‌ రెడ్డి కాలనీకి చెందిన శివకుమార్‌ అనే నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు.

● 2018 జూన్‌లో సత్యరాఘవేంద్రనగర్‌ కాలనీ ఓపెన్‌ నాలాలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు.

● 2018 సెప్టెంబర్‌లో సరూర్‌నగర్‌లో నాలాలో పడి హరీష్‌(24) అనే యువకుడు గల్లంతయ్యాడు.

● 2018 అక్టోబర్‌లో బోరబండలో రాజయ్య అనే వ్యక్తి నాలాలో పడి మరణించాడు.

● 2019 సెప్టెంబర్‌లో నాగోల్‌ దగ్గరి ఆదర్శనగర్‌ నాలాలో పడి పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ మరణించాడు.

● 2019లోనే ఇద్దరు అర్చకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ నాలాలో పడిపోగా ఒకరు మృతి చెందారు.

● 2020 సెప్టెంబర్‌ నేరేడ్‌మెట్‌లో నాలాలో పడి సుమేధ(12) అనే బాలిక మృతి చెందింది.

● 2020 నవంబర్‌లో సరూర్‌నగర్‌ కోదండరామ్‌నగర్‌లో మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన వృద్ధురాలు ,సమీంలోని మరో ప్రాంతంలో ఇంకో వ్యక్తి నాలాలో పడి మృతి చెందారు.

● 2021 జూన్‌లో ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఆనంద్‌ సాయి అనే ఏడేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు.

● 2021 సెప్టెంబర్‌లో మణికొండలో నాలా కోసం తవ్విన గుంతలో పడి రజనీకాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు.

● 2023 ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌ కళాసిగూడలో నాలాలో పడి మౌనిక అనే నాలుగేళ్ల బాలిక మరణించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement