హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి, సిటీబ్యూరో: అన్ని విధాలుగా అర్హత కలిగి ఉండి..సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ అనుమతి పత్రాలను (ప్రొసీడింగ్స్)ను అందజేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అక్రమ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఈ ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలులో సందేహాల నివృత్తి కోసం కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల్లో 25 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుతో పాటు ప్లాట్‌లలో ఓపెన్ స్పేస్ చార్జీలను (ప్రొ–రాటా) కూడా చెల్లించిన వాళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్–2020 పథకంలో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రస్తుతం స్థలాలను క్రమబద్ధీకరించుకొనే సదుపాయం ఉంది. తిరస్కరణకు గురయ్యే దరఖాస్తులపైన చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్ చేస్తారు. మిగతా 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కోసం కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తదితర నీటివనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న ప్లాట్‌లకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అనుమతితోనే ఎల్‌ఆర్‌ఎస్‌లు లభిస్తాయి. నిషేధిత భూములు, సరస్సులు, నీటి వనరుల పరిధిలో లేకుండా, అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఫీజు నోటీసులు అందుతాయి. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి 10 రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు.
సందేహాల నివృత్తి ఇలా..
● ఎల్‌ఆర్‌ఎస్‌ల దరఖాస్తులు ఏ దశలో ఉన్నా, ప్రొసీడింగ్ వివరాలు, ఫీజ్ వివరాలు, షార్ట్‌ఫాల్స్ తదితర వివరాల కోసం ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
● అలాగే హెచ్‌ఎండీఏ కాల్‌సెంటర్: 18005998838 నంబర్‌కు సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment