No Headline
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా వినికిడి పరీక్ష నిర్వహించాలని పర్యావరణ, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచ హియరింగ్ డే సందర్భంగా జూబ్లీహిల్స్ మా ఈఎన్‌టీ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మనిషికి అందం, ఐశ్వర్యం ఉన్నా వినికిడి జ్ఞానం లేనపుడు ఆ జీవితం అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ‘పిల్లలు మనం మాట్లాడినపుడు విని మాటలు నేర్చుకుంటారు. వినలేకపోతే మూగవారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి చెప్పినపుడు మనకు ఆ మాట వినిపించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చికిత్సలు చేయించుకోవడానికి కొంత మందికి ఆర్థిక స్థోమత సహకరించకపోవచ్చు. అందుకే మూగ, చెవుడు చికిత్సలకు వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో రూ.7 లక్షల వరకు అందించింది. తరువాత వచ్చిన ప్రభు త్వం దీన్ని నిలిపివేసింది. మా ప్రభుత్వంలో పునరుద్ధరించడానికి ప్రతిపాదిస్తాం. ఆయన వైద్యుడు కాబట్టే మనిషి ఆరోగ్యం విలువ తెలిసిన వ్యక్తిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి, అందరికి నాణ్యమైన వైద్యం అందించారు. వైఎస్సార్‌కు రూపాయి డాక్టర్ అనే పేరుండేది’ అని మంత్రి గుర్తుచేశారు. ఆసుపత్రులు డబ్బులే కాకుండా పేదలకు కొంత సేవా దృక్పథంతో ఉచితంగా చికిత్సలు అందించా లని కోరారు. మా ఇంట్లోనూ వినికిడి సమస్య వంశపారంపర్యంగా(జెనిటిక్) వస్తుందని తెలిపారు. మా ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యుడు మేఘనాథ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ఈ ఏడాది హియరింగ్ డే జరుపుకుంటోందన్నారు. కార్యక్రమంలో మా ఈఎన్‌టీ ఆసుపత్రి ఎండీ సునీత జీ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment