ఎల్‌బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్‌బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్‌బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు.
సమావేశంలో ఎల్‌బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు.
టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్‌ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్‌లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌డీపీ సీఈ కిషన్, ఎస్‌ఈలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌రావు, హార్టికల్చర్ డీడీ రాజ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
వరదనీటి కాలువ పనుల పరిశీలన
నాగోలు: ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎస్‌ఎన్‌డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్‌ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment