
నగర మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో వనితలే..
బల్దియాలోని 150 వార్డుల్లో 78 మంది కార్పొరేటర్లు వీరే..
14 మంది అడిషనల్ కమిషనర్లకుగాను ఆరుగురు అతివలే..
పారిశుద్ధ్య కార్మికుల్లో 18 వేల మందికి పైగా మహిళలే..
సాక్షి, హైదరాబాద్ : కోటిమందికి పైగా ప్రజలకు వివిధ సేవలందిస్తున్న మహా నగరపాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ)లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అటు పాలకమండలిలో, ఇటు అధికారుల్లోనూ వారు తమ సేవలందిస్తున్నారు. పాలకమండలికి నేతృత్వం వహించే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. అంతేకాదు 150 మంది కార్పొరేటర్లకు గాను 50 శాతం రిజర్వేషన్లతో 75 మందికి మాత్రమే అవకాశమున్నప్పటికీ, 79 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎన్నిక కాగా, వారిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం 78 మంది.. 78 వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి వార్డుల్లో ప్రజల సమస్యలు తీర్చడంలో, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తేవడంలో వారిదే ముఖ్య భూమిక. ఇక పారీ్టల పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌లో 26 మంది, బీజేపీలో 23 మంది, ఎంఐఎంలో 18 మంది, కాంగ్రెస్‌లో 11 మంది తమ వార్డుల్లో పనులు చేస్తున్నారు.
అధికారుల్లో..
ఇక జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం అధికారుల్లోనూ 14 మంది అడిషనల్ కమిషనర్లకుగాను ఆరుగురు మహిళలే. వారు ఆర్థికం, ఆరోగ్యం, ఎన్నికలు, జీవవైవిధ్యం, డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీస్ వంటి కీలక విభాగాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు పరిపాలన విభాగం బాధ్యతలు నిర్వర్తించిన అధికారిణి బదిలీ కావడం తెలిసిందే. సీఎఫ్‌ఏ, ఎస్టేట్స్ ఆఫీసర్, ఏపీఆర్‌ఓ, ఐటీ జాయింట్ కమిషనర్, స్పోర్ట్స్ జాయింట్ కమిషనర్, చీఫ్ హార్టికల్చరిస్ట్, సీఎంఓహెచ్‌లతో పాటు ఎస్‌ఈలుగా, ఈఈలుగా తదితర ఉన్నత పదవుల్లో మహిళలే ఉన్నారు.
సర్కిళ్లలోనూ..
మరో ఆరుగురు మహిళలు సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్కిల్ స్థాయిలో ఏ పని కావాలన్నా వారిని సంప్రదించాల్సిందే. అన్ని పనుల పర్యవేక్షణ, అజమాయిషీ వారివే. క్షేత్రస్థాయిలో పనులు చేయాల్సింది వారే. ప్రజల సమస్యలు స్థానికంగానే పరిష్కారమయ్యేందుకు వారిదే కీలకపాత్ర కావడం తెలిసిందే.
పారిశుద్ధ్యంలోనూ వీరే..
అధికారాల్లోనే కాదు. స్వేదం చిందించడంలోనూ అతివలే కష్టపడుతున్నారు. క్షేత్రస్థాయిలో నగరాన్ని శుభ్రపరుస్తున్నదీ మహిళలే. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కారి్మకుల్లో 18 వేల మందికి పైగా మహిళలే ఈ నగరాన్ని శుభ్రం చేస్తున్నారు. నగరాన్ని తల్లుల్లా పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
తరుణీ తరుణం!
లక్టీకాపూల్: మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగినులు ఆహ్లాదంగా ఆటాపాటలతో గడిపారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు పంకజ, సుభద్రాదేవి, అలివేలు మంగతాయారు, సరోజ, గీతా రాధిక, జాయింట్ కమిషనర్ ఉమా ప్రకా‹Ù, డీఎంహెచ్‌ఓ డా.పద్మజ తదితరులు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి, ఇతర మహిళా ఉన్నతాధికారులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మహిళా శానిటరీ వర్కర్లను మేయర్, డిప్యూటీ మేయర్ ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు.