Yamuna Expressway
-
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన హిమాచల్‌ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
వాహనాలకు ‘నైట్రోజన్’ టైర్లు
న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్ కలసిన రబ్బర్ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
యూపీలో ఘోరం
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో నుంచి ఢిల్లీకి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 29 మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. యూపీలోని అవథ్ డిపోకు చెందిన ‘జనరథ్’ బస్ లక్నో నుంచి ఢిల్లీలోని ఆనంద్‌విహార్ బస్‌స్టేషన్‌కు బయల్దేరింది. సోమవారం వేకువజామున 4 గంటలవేళ ఎత్మద్‌పూర్ సమీపంలో అదుపు తప్పిన బస్సు రైలింగ్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో మునిగి ఉండటం, నాలాలో సుమారు 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను రక్షించగలిగారు. కొన్ని మృతదేహాలు కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన 29 మందిలో 19 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 18 మంది క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పూర్తిగా నుజ్జయిన బస్సును కాల్వ నుంచి బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ‘టూ టయర్ స్లీపర్ కోచ్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి అదుపు తప్పి ఝర్నా నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు’ అని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఘటనా స్థలికి చేరుకుని, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం తక్షణమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక అందజేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. నోయిడాను ఢిల్లీ శివార్లలోని ఆగ్రాతో కలిపే 165 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విశాలమైన ఈ రహదారిపై వాహనాల అతివేగం కారణంగా, ముఖ్యంగా రాత్రివేళ, వేకువజామున ఎక్కువగా సంభవిస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న పోలీసులు -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం
నోయిడా : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రోడ్లపై యుద్ధ విమానాలు..
-
అమ్మకానికి యమున ఎక్స్‌ప్రెస్‌వే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద రియల్-ఎస్టేట్ డెవలపర్ జేపీ, ఢిల్లీలోని తన ముఖ్యమైన హైవేని అమ్మేస్తుంది. యమున ఎక్స్‌ప్రెస్‌వేను మరో డెవలపర్‌కు రూ.2500 కోట్లకు అమ్మేస్తున్నట్టు జేపీ ఇన్ఫ్రాటెక్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఆగ్రాను కలిపే ఆరు వరుసల యమున ఎక్స్‌ప్రెస్‌వేను, జేపీ 2012లో నిర్మించింది. దీని ఖర్చు రూ.13వేల కోట్లు. ఈ ప్రాజెక్టులో కంపెనీకి వాటా ఉంది. టోల్ ద్వారా సేకరించిన నగదును ఈ కంపెనీనే పొందుతోంది. 30వేల మందికి పైగా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా దివాలా తీసిన క్రమంలో ఆ మొత్తాన్ని వారికి చెల్లించడానికి కంపెనీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫ్లాట్ ఓనర్ల ప్రయోజనాల మేరకు దివాలా తీసిన జేపీని ఈ నెల 27 వరకు రూ.2000 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఫ్లాట్ల ఓనర్లకు రీఫండ్ చేయొచ్చని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా తీయమని బ్యాంకులు కోరాయి. ఒక్కసారి కంపెనీ తాను దివాలా తీసినట్టు ప్రకటిస్తే, కొనుగోలుదారులకు తమ అపార్ట్మెంట్లు, పెట్టుబడులు వెనక్కి రావు. ఈ విషయంపై జేపీ కొనుగోలుదారులు కోర్టుకు ఎక్కారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు - బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సదాబాద్ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. -
చేతులు జోడించి వేడుకున్నా...
ఆగ్రా: యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడొకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీ అమానవీయంగా వ్యవహరించారని మృతుడి కుమార్తె ఆరోపించారు. 'స్మృతి ఇరానీ కాన్వాయ్ లోని వాహనం మా కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి ఇరానీ బయటకు వచ్చారు. సహాయం చేయమని చేతులు జోడించి వేడుకున్నాను. కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయార'ని మృతుడి కుమార్తె మీడియాతో చెప్పారు. తన సోదరి ఎంతగా బతిమాలినా మంత్రి మనసు కరగలేదని మృతుడి కుమారుడు వాపోయాడు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రమాద బాధితులకు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, చికిత్స అందించాలని స్థానిక అధికారులను స్మృతి ఇరానీ ఆదేశించారని వెల్లడించింది. ప్రమాదానికి ఇరానీ కాన్వాయ్ కారణం కాదని పేర్కొంది. -
రోడ్డు ప్రమాదంలో స్మృతి ఇరానీకి గాయాలు
ఆగ్రా: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వల్పగాయాలయ్యాయి. యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీతో పాటూ, బీజేకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వ్రిందావన్‌లో తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కారులో ఢిల్లీ వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్మృతి ఇరానీ మోకాలుకు గాయమైనట్టు సమాచారం. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
పొగమంచు కారణంగా 20 వాహనాలు ఢీ
న్యూ ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా20 వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని జెవార్ టోల్ ప్లాజా సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఢిల్లీకి 77 కిలో మీటర్ల దూరంలో ఈ టోల్ ప్లాజా ఉంది. యమునా ఎక్స్ ప్రెస్ వే గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రాకు 165 కిలోమీటర్ల మేర ఉంది. ఉదయం సమయంలో కేవలం 50 మీటర్ల దూరంలోపు మాత్రమే విజిబిలిటీ ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. -
సురక్షితంగా ల్యాండ్ అయిన ఫైటర్ జెట్
నోయిడా: భారత వైమానికి దళానికి చెందిన మిరాగ్ 2000 ఫైటర్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జరిగిన పరీక్షల్లో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీ శివారులోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై సురక్షితంగా దిగి... మళ్లీ టేక్ ఆఫ్ తీసుకుంది. పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో గాలిలో కొద్ది సేపు చక్కర్లు కొట్టిన అనంతరం ఫైటర్ జెట్ విజయ వంతంగా భూమి మీదకు దిగింది. మధురైకి సమీపంలో సాధారణ పరిశోధనలో భాగంగానే ఈరోజు ఉదయం పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇది రొటీన్ ఆపరేషన్‌లో భాగమేనని సమాచారం. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇలాంటి పరీక్షలను మరిన్ని నిర్వహించేందుకు అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.