చేతులు జోడించి వేడుకున్నా...
ఆగ్రా: యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడొకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీ అమానవీయంగా వ్యవహరించారని మృతుడి కుమార్తె ఆరోపించారు.
'స్మృతి ఇరానీ కాన్వాయ్ లోని వాహనం మా కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి ఇరానీ బయటకు వచ్చారు. సహాయం చేయమని చేతులు జోడించి వేడుకున్నాను. కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయార'ని మృతుడి కుమార్తె మీడియాతో చెప్పారు. తన సోదరి ఎంతగా బతిమాలినా మంత్రి మనసు కరగలేదని మృతుడి కుమారుడు వాపోయాడు.
అయితే ఈ ఆరోపణలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రమాద బాధితులకు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, చికిత్స అందించాలని స్థానిక అధికారులను స్మృతి ఇరానీ ఆదేశించారని వెల్లడించింది. ప్రమాదానికి ఇరానీ కాన్వాయ్ కారణం కాదని పేర్కొంది.