ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు | Rains lash northern states, 28 dead in Himachal, Punjab | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు

Published Tue, Aug 20 2019 4:21 AM | Last Updated on Tue, Aug 20 2019 4:21 AM

Rains lash northern states, 28 dead in Himachal, Punjab - Sakshi

కులూలో బియాస్‌ నది వరద ఉధృతికి ధ్వంసమైన ఓ వంతెన

సిమ్లా/డెహ్రాడూన్‌/చండీగఢ్‌:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్‌ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించింది..  

పంజాబ్‌ ప్రభుత్వం హైఅలర్ట్‌
విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్‌ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్‌ బృందాలు కాపాడాయి. రోపార్‌ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్‌ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్‌ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్‌ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది.   

ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన
హిమాచల్‌ప్రదేశ్‌– ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది.   హరిద్వార్‌ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్‌ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది.

ఢిల్లీకి వరద ముప్పు
యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్‌ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్‌ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement