సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిటీ బస్సు టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనాను చిదిమేయడంతో ఇద్దరు చిన్నారులకు తల్లి దూరమైంది. మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నగరవాసులను కలచి వేసింది. ఇది ఒక్కటనే కాదు.. సిటీ ఆర్టీసీ టెర్రర్ జాబితాలో ఏటా వందల కేసులు చేరుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 2,225 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వాటిలో ఆర్టీసీ బస్సులతోనే 107 చోటుచేసుకున్నాయి. కండిషన్ తప్పిన బస్సులకు తోడు ఆర్టీసీ సమ్మె కారణంగా వచ్చిన తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.
నాలుగో స్థానం...
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రమాదకారకాలుగా మారుతున్న వాహనాలకు సంబంధించి ప్రతిఏటా జాబితా రూపొందిస్తారు. ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని వాహనాల వరకు 13 కేటగిరీలు ఉన్నాయి. ఈ పట్టికలో ఆర్టీసీ బస్సులు నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి. తొలి మూడు స్థానాల్లో ద్విచక్ర, తేలికపాటి, త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. చివరకు అత్యంత ర్యాష్‌గా ప్రయాణిస్తాయని భావించే డీసీఎంల కంటే ఆర్టీసీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రయిందంటే రెచ్చిపోయి ప్రయాణించే ప్రైవేట్ బస్సులతోనూ చూసినా... ప్రమాదకారకాలుగా మారే విషయంలో ఆర్టీసీ కంటే అవే మిన్నగా ఉన్నాయి.
ఉల్లంఘనల్లోనూ ముందే..
సాధారణ పరిస్థితుల్లోనే సిటీలో ఆటోల తర్వాత ఆ స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేది ఆర్టీసీ బస్సులేనన్నది పోలీసు అధికారుల మాట. వీటివల్లే అనేక చోట్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది ఇప్పటికే అనేకసార్లు చర్చనీయాంశమైంది. ఆర్టీసీ డ్రైవర్లు పాల్పడుతున్న ఉల్లంఘనల్లో బస్‌బేల్లో పార్క్ చేయకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, స్పీడ్ టర్నింగ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడం, కాలం చెల్లిన బస్సులు ఫిట్‌నెస్ కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.
మూడేళ్లలో ఆర్టీసీ ప్రమాదాలు ఇలా...
ఏడాది | ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
2017 | 120 | 33 | 98 |
2018 | 149 | 35 | 126 |
2019(నవంబర్25 వరకు) | 107 | 25 | 104 |
డొక్కులు..తుక్కులు
సాక్షి, సిటీబ్యూరో: అసలే లారీలు, ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు.. ఆపై రెండు నెలలుగా ఎలాంటి మరమ్మతులు, నిర్వహణ లేని బస్సులు.. పైగా వాటిలో సగం డొక్కువే.. ఇంకేముంది యమదూతల్లా జనంపైకి దూసుకొస్తున్నాయి. ప్రమాదాలతో హడలెత్తిస్తున్నాయి. నగరంలో గత 53 రోజుల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఓవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం.. మరోవైపు మరమ్మతులకు నోచని బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా బస్సుల నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ప్రతి బస్సుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సిన మెకానిక్‌లు, శ్రామికులు, ఫోర్‌మెన్ స్థాయి ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఏ బస్సులో? ఎలాంటి సమస్యలు? ఉన్నాయో గమనించేవారు లేకుండా పోయారు. ఇలాంటి బస్సులు ఇప్పుడు తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో నడుస్తున్నాయి. ప్రతిరోజు ఇసుక లారీలు, ట్రాక్టర్లు నడిపే సరకు రవాణా డ్రైవర్లు ప్రయాణికుల కోసం వినియోగించే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 36 ప్రమాదాలు జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా డివైడర్‌కు ఢీకొట్టడం లాం టివి కొన్నయితే, వాహనదారులను ఢీకొట్టినవి మరికొన్ని. గత నెలలో ఛే నంబర్ వద్ద, మూసారాంబాగ్ లో ఆర్టీసీ బస్సులు అదుపు తప్పి ఢీకొట్టడంతో ఇద్దరు బైక్ రైడర్లు చనిపోయారు. తాజాగా బంజారాహిల్స్ లో మరో మహిళ మృత్యువాత పడ్డారు. బస్సు ఫిట్‌నె స్ బాగానే ఉందని, బ్రేకులు ఫెయిల్ కాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ... గత రెండు నెలలుగా నిలిచిపోయిన నిర్వహణపరమైన సేవల కారణంగా సిటీ బస్సులు ఎప్పుడు? ఎక్కడ? ఏ వాహనాన్ని ఢీకొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.
షెడ్యూలింగ్ సేవలు ఇలా...
బస్సులకు 3 రకాలుగా తనిఖీలు, మరమ్మతులు చేస్తారు. ఆ వివరాలివీ...
షెడ్యూల్–1: డ్యూటీ ముగిసి డిపోకు చేరిన బస్సును మెకానిక్‌లు ప్రతిరోజు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. బస్సు జాయింట్స్, బోల్టులు, సౌండ్ సిస్టమ్ వంటివి పరిశీలిస్తారు. డ్రైవర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి మరమ్మతులు చేస్తారు.
షెడ్యూల్–2: ఇందులో భాగంగా ప్రతి వారం/ పది రోజులకు ఒకసారి బస్సులను పూర్తిగా తనిఖీ చేస్తారు. ఐదుగురు మెకానిక్‌లు కలిసి ఈ పని చేస్తారు. ఇందులో ఇంజిన్ మెకానిక్, కోచ్ మెకానిక్, టైర్ మెకానిక్, ఎలక్ట్రికల్ మెకానిక్, కోచ్ బిల్డర్లు భాగస్వాములవుతారు. అవసరమైన విడిభాగాలను అమర్చుతారు. ఒకవేళ విడిభాగాల కొరత ఉంటే ఆ బస్సులను బయటకు తీయకుండా మెకానిక్ పనులు పూర్తయ్యే వరకు డిపో గ్యారేజీలోనే ఉంచుతారు.
షెడ్యూల్–3: ప్రతి 40 రోజులకు ఒకసారి ఓవర్‌హాలిం గ్ పనులు జరుగుతాయి. బస్సు ఇంజిన్ సహా అన్నిం టినీ చెక్ చేసి సమూలమైన మరమ్మతులు చేస్తారు. దీంతో బస్సు అన్ని విధాలుగా ఫిట్‌గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment