సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల పిడుగు పడింది. ఆర్డినరీ కనీస చార్జీలను ఏకంగా రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఆ తర్వాత మూడో స్టేజీ నుంచి ఒక టికెట్‌పై రూ.5 పెంచేశారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీలను యథావిధిగా రూ.10 కొనసాగిస్తూనే... మూడో స్టేజీ నుంచి రూ.5 చొప్పున పెంచారు. ఎక్కువ దూరమున్న రూట్లలో కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ చార్జీల పెంపు రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది. మెట్రో డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీలను రూ.10 నుంచి రూ.15కు పెంచారు. ఆ తర్వాత మెట్రో ఎక్స్‌ప్రెస్ తరహాలోనే చార్జీల పెంపు వర్తిస్తుంది. మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల చార్జీలను కొంతమేరకు తగ్గించనున్నారు. ఈ చార్జీల తగ్గింపుపై మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది.
మంగళవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. చార్జీల పెంపు వల్ల గ్రేటర్‌లోని 32లక్షల మంది ప్రయాణికులపై రోజుకు రూ.71 లక్షల భారం పడనుంది. ప్రతినెలా రూ.21.3 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.255.6 కోట్ల వరకు ఈ భారం ఉంటుంది. ప్రస్తుత చార్జీలపై 23.5 శాతం చొప్పున పెంచినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చిల్లర సమస్యలను అధిగమించేందుకు వీలుగా హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ప్రతిరోజు రూ.76లక్షల ఆదాయం లభించినప్పటికీ.. నష్టాలను పూర్తిస్థాయిలో అధిగమించడం సాధ్యం కాబోదని ఈడీ తెలిపారు. ప్రస్తుతం ప్రతినెలా రూ.45 కోట్ల నష్టం వస్తోంది. చార్జీల పెంపు వల్ల రూ.21.3 కోట్లు అదనంగా లభిస్తుంది.
అయినా మరో రూ.23.7 కోట్ల లోటు ఉంటుంది. నష్టాలను పూర్తిగా తగ్గించుకునేందుకు ట్రిప్పులను తగ్గించడంతో పాటు ఉదయం, రాత్రి ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేని సమయాల్లో షటిల్ సర్వీసులను తగ్గించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. అవసరం లేని ట్రిప్పులను తగ్గించడంతో పాటు, అవసరమైన మార్గాల్లో పెంచడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోను 69 శాతం నుంచి 73శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పది ఉంటేనే ప్రయాణం!
Published Tue, Dec 3 2019 7:50 AM | Last Updated on Tue, Dec 3 2019 7:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment