‘సమ్మె’లో కుమ్మేశారు! | Corruption in TSRTC Strike Time Hyderabad | Sakshi
Sakshi News home page

‘సమ్మె’లో కుమ్మేశారు!

Published Sat, Feb 22 2020 10:55 AM | Last Updated on Sat, Feb 22 2020 10:56 AM

Corruption in TSRTC Strike Time Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు బస్సుల్లో టిక్కెట్‌ తీసుకొనే బాధ్యత ప్రయాణికుడిదే కావడం వల్ల కండక్టర్లకు కొద్దిగా ఊరట లభించింది. కానీ గతంలో లెక్కల్లో ఒక్క రూపాయి తేడా వచ్చినా..ఉద్యోగంఊడిపోవలసిందే. ప్రతినిత్యం ఎంతోమంది కండక్టర్లు అభద్రతతో  పనిచేసేవారు. కానీ అలాంటి ఆర్టీసీలో కొందరు అధికారులే తమ చేతివాటాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్టీసీ ఆడిట్‌ విభాగం చేపట్టిన గణాంకాల్లో నగరంలోని పలు డిపోల్లో లక్షలాదిరూపాయలు లెక్కల్లో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమ్మె కాలంలో డిపో స్థాయి అధికారులే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చుననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె మొదలైన కొద్ది రోజుల పాటు ఎలాంటి టిక్కెట్లులేకుండానే బస్సులుసడిపారు.

ఆ తరువాత ప్రింటెడ్‌  టిక్కెట్‌లు  ముద్రించినప్పటికీ వాటిపైన వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో జమ చేయకుండా  కొందరు డిపోమేనేజర్‌లు తమ జేబుల్లోవేసుకున్నట్లు ఆరోపణలు  వినిపిస్తున్నాయి. మరోవైపు అద్దె బస్సుల యజమానులు సైతం ఆర్టీసీ డిపోల్లో ట్యాంకుల కొద్దీ డీజిల్‌ నింపుకొని ఆర్టీసీకి  ఒక్క రూపాయి కూడా  చెల్లించకుండా తమకు నచ్చిన రూట్‌లలో బస్సులు నడుపుకొన్నారు. వచ్చిన సొమ్మును ఆర్టీసీకి అద్దె చెల్లించకుండానే ఎగురేసుకెళ్లారు. తీవ్ర నష్టాల్లో కూరుకొనిపోయి ఉన్న ఆర్టీసీలో కొంతకాలంగా  ప్రక్షాళన పర్వం కొనసాగుతున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలో ఆడిట్‌ విభాగం చేపట్టిన డిపోస్థాయి తనిఖీల్లో అనేక అక్రమాలు  వెలుగు చూస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీలో అవినీతి, అక్రమాలకు తావు లేదు. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. కానీ సమ్మె కాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది.’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

రూ.లక్షల్లోనే కాజేశారు....
నగర శివార్లోని ఒక డిపోలో  రూ.5 లక్షలు తక్కువ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు బస్సులు నడిపే మరో డిపోలోనూ సుమారు  రూ.7 లక్షల వరకు సొమ్ముకు సరైన లెక్కలు లేవు. అలాగే నగరంలోని మరో కీలకమైన డిపోలోనూ ఇదే పరిస్థితి. సుమారు  56 రోజుల పాటు సమ్మె  జరిగింది. ఆ సమ్మె కాలంలో బస్సులు నడపడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ  డిపో స్థాయి నిర్వహణ కొరవడింది. ప్రింటెడ్‌ టిక్కెట్‌లపైన లెక్కాపత్రం లేకుండాపోయింది. ఏ రోజుకు ఆ రోజు నడిపిన బస్సులు, వాటిపైన వచ్చిన ఆదాయం పైన కూడా జవాబుదారీతనం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఇప్పుడు  ఆడిటింగ్‌లో తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నగరంలోని అన్ని డిపోల్లో  ప్రతి రోజు 1500 నుంచి 2000కు పైగా బస్సులు నడిచాయి. ప్రయాణికులు సైతం ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడకుండా  తాత్కాలిక కండక్టర్‌లు, డ్రైవర్‌లపైన పోలీసులు, ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించడం సత్ఫలితాలను ఇచ్చింది. కానీ సాధారణ రోజుల్లో  ప్రతిరోజు కనీసం రూ.కోటి ఆదాయం వచ్చే ఆర్టీసీలో సమ్మె రోజుల్లో రూ.25 లక్షల కంటే ఎక్కువ రాలేదు. నిజానికి అద్దె బస్సుల యజమానుల నుంచి రావలసిన సొమ్ము రాకపోవడం కూడా ఇందుకు కారణమే. అదే సమయంలో కొందరు అధికారుల చేతివాటం కూడా అక్రమాల పర్వానికి ఆజ్యం పోసినట్లయిందనే ఆరోపణలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.  

నిద్రపోయిన నిఘా వ్యవస్థ...
ఆర్టీసీ స్వీయ నిఘా వ్యవస్థ విజిలెన్స్‌ విభాగంసమ్మె కాలంలో నిస్తేజంగా ఉండడం కూడా ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్‌ అధికారులు డిపోలపైన సరైన నిఘా ఉంచకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా మారింది. సాధారణంగా  విజిలెన్స్‌ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు  క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. కానీ సమ్మె కాలంలో అలాంటి  పారదర్శకమైన వ్యవస్థ ఏ స్థాయిలోనూ పని చేయకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement