
ప్రమాద స్థలంలో పడి ఉన్న బైక్ మీనాక్షి (ఫైల్)
పుల్‌కల్(అందోల్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురు మృతి చెందిన విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని శివంపేట బ్రిడ్జిపై జరిగింది. ప్రమాదంలో చిన్నారి తల్లితోపాటు వారి బంధువైన మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్‌కల్ ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలం కాదులూర్ గ్రామానికి చెందిన రమేశ్(28), అతడి భార్య లక్ష్మి, మూడేళ్ల కూతురు మీనాక్షి, అక్క కొడుకు శ్రీహరిని తీసుకొని బైక్‌పై కూకట్‌పల్లి వెళ్లేందుకు బుధవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరాడు.
వారు శివంపేట బ్రిడ్జి వద్దకు రాగానే సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్, అతడి కూతురు మీనాక్షి బస్సు కింద పడ్డారు. తనతో పాటు మేన అల్లుడు శ్రీహరి బస్ తగిలిన వెంటనే కింద పడిపోయామని ఆసుపత్రికి వచ్చే వరకు ఏం జరిగిందో తెలియదని లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీహరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. లక్ష్మి ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. రమేశ్, మీనాక్షి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులతోపాటు ట్రాఫిక్ సీఐ, పుల్‌కల్ ఎస్‌ఐలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు
Comments
Please login to add a commentAdd a comment