దిగపండి, గోకర్ణపూర్ 56వ జాతీయ రహదారిలో పల్టీకొట్టిన బస్
బరంపురం/భువనేశ్వర్ : నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో గల దిగపండి 56వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు పల్టీ కొట్టడంతో ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురు ప్రయాణికుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దిగపండి ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
భువనేశ్వర్‌లోని సాలియా సాహి బస్తీ వాసులు 25 మంది గంజాం జిల్లాలోని బంకేశ్వరి పీఠం సందర్శనకు బస్సులో బయల్దేరారు. వారంతా బస్సులో సోమవారం ఉదయం సురడా నుంచి బరంపురం వస్తుండగా సరిగ్గా దిగపండి పోలీసు స్టేషన్ పరిధి 56వ జాతీయ రహదారి గోకర్ణపూర్ గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు పల్టీకొట్టింది.
దీంతో బస్సులోని ప్రయాణికులంతా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత దిగపండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. జరిగిన ధుర్ఘటనపై దిగపండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment