విషాద ప్రయాణం | two died in Bus rolled | Sakshi
Sakshi News home page

విషాద ప్రయాణం

Published Wed, Jun 20 2018 11:25 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two died in Bus rolled - Sakshi

వేములపల్లి (మిర్యాలగూడ) : ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు పల్టీ కొట్టిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (ఏపీ 04వై 7181)లో 28 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లా చీరాలకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతానికి చేరుకునే సరికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. 

దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ దిమ్మెలను ఢీకొట్టి రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన యలమల సుబ్బరావమ్మ(55), అదేజిల్లాకు చెందిన మార్టూరు మండలం బొబ్బాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లి నాగేశ్వర్‌రావు(31) అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బరావమ్మ హైదరాబాద్‌లోని తన అన్న ఇంటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తోంది. నాగేశ్వరరావు హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుపాటి శ్రీనివాసప్రసాద్, చంద్రవాణి దంపతులు, నర్సరావుపేటకు చెందిన రాగ విజయలక్ష్మీతో పాటు ఆమె కుమారుడు మనీష్‌కార్తీక్‌రెడ్డి, తల్లి గుంటా సుబ్బమ్మకు స్వల్పగాయాలయ్యాయి.

ఏరియా ఆస్పత్రిలో బాధితులు..
బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మాడ్గులపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్, మిర్యాలగూడ టూటౌన్‌ ఎస్‌ఐ శేఖర్‌ పోలీస్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఐదుగురిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుబ్బరావమ్మ, నాగేశ్వర్‌రావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలానికి చేరుకని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయాణికుడు శ్రీహర్షారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

స్వగ్రామానికి వస్తూ మృత్యువాత
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లికి చెందిన బిల్లి నాగేశ్వరరావు (32) బేల్దారు పని చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో సోమవారం రాత్రి నాగేశ్వరరావు స్వగ్రామం బయలుదేరాడు. నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తాపడిన ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం బబ్బేపల్లి తరలించారు. నాగేశ్వరరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కారంచేడు: మండలంలోని  స్వర్ణ గ్రామానికి గ్రామానికి చెందిన యలవల సుబ్బరావమ్మ (53)  రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నివాసముంటున్న తమ్ముడు వద్దకు తన తల్లిని వదిలి వచ్చేందుకు వెళ్లిందని కుటుంబసబ్యులు తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్‌ ఎక్కింది. నల్లగొండ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.   సమాచారం అందుకున్న ఆమె భర్త సాంబయ్య హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి తమ్ముడు కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు. మృతదేహాన్ని స్వర్ణకు తరలిస్తున్నారు. 

నిద్రమత్తులో ఉండగా పెద్ద శబ్దం వచ్చింది..
నేను హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం చీరాలకు లక్ష్మీగాయత్రి ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరాను. ప్రయాణికులందరూ నిద్రమత్తులో ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు పెద్ద శబ్దంతో రెండు పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ చెల్లాచెదురయ్యారు. బస్సు ముందు వరుసలో కూర్చున్న మహిళ బస్సులో ఇరుక్కుని మృతిచెందింది. వెనుక భాగంలో ఉన్న మరో ప్రయాణికుడు కూడా మృతిచెందాడు. మిగతావాళ్లం స్వల్పగాయాలతో బయటపడ్డాం.  
– వారి శ్రీహర్షారెడ్డి, 
బస్సు ప్రయాణికుడు, చీరాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement