బనిహల్/జమ్మూ: కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూలోని రంబన్ జిల్లాలో మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 22 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం కిక్కిరిసిన ప్రయాణికులతో మినీ బస్సు రంబన్ నుంచి బనిహల్‌కు బయలుదేరింది. ఉదయం 9.55 గంటలకు జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతుండగా మారూఫ్ సమీపంలోని కేళా మోల్ వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడింది.
మృతుల్లో నలుగురు మహిళలతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పది మందిని హెలికాప్టర్లలో ఉదంపూర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరిని జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఆరు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్, మరో ప్రైవేట్ హెలికాప్టర్ సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment