minibus accident
-
లోయలో పడిన బస్సు.. 35 మంది మృతి
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని కిస్తవర్ జిల్లాలో సోమవారం ఓ మినీబస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారని సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు శక్తి పాతక్ తెలిపారు. మరణించిన 35 మందిలో 13 మంది మహిళలే. వారిలో 45 రోజుల పసికందుతోపాటు ముగ్గురు టీనేజర్లు సాజన్ శర్మ (18), వసీమ్ రాజా (18), షజియా (19)లు ఉన్నారు. కేష్వాన్ నుంచి కిస్తవర్ వెళుతున్న బస్సు సోమవారం ఉదయం 7:30 గంటలకు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ లోయలోకి పడిపోయింది. బస్సు సామర్థ్యం 28 కాగా, అందులో 52 మంది ఉన్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఏఎస్ రాణా తెలిపారు. పోలీసులు, రక్షణ బలగాలు, స్థానికులు కలసి బస్సులోని వారిని బయటకు తీశారు. ఎంఐ–17 హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఆస్పత్రికి తరలించారు. అందులో తొమ్మిది మందికి జమ్మూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన నేతలు.. ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యప్రకాశ్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో 32 మంది మృతి చెందడం హృదయ విదారకమని ప్రధాని మోదీ అన్నారు. మృతిచెందిన వారి కోసం దేశమంతా రోదిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్డు ప్రమాద వార్త వినగానే విచారానికి లోనయ్యానని అన్నారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరితోపాటు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, గులాం నబీ ఆజాద్, గులామ్ అహ్మద్ మిర్, ఎంవై తరిగమిలు కూడా ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ పర్వత ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ గురించి ఈ ప్రమాదం ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు. ఇనుప కంచెలు నిర్మించాలి: ఐఆర్ఎఫ్ సురక్షిత రోడ్డు ప్రయాణం కోసం కృషి చేస్తున్న జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) సంస్థ ఈ ప్రమాదంపై స్పందించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. పర్వత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరింది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ ఎమిరిటస్ కేకే కపిల అన్నారు. వాహనాల్లో జీపీఎస్‌ను అమర్చడంతో పాటుగా లోయ ఉన్న వైపు దృఢమైన ఇనుప కంచె నిర్మించాలన్నారు. భారత్‌లో 2017లో రోడ్డు ప్రమాదాల్లో 1.46 లక్షల మంది మృతి చెందారు. -
200 అడుగుల లోయలోకి..
బనిహల్/జమ్మూ: కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూలోని రంబన్ జిల్లాలో మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 22 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం కిక్కిరిసిన ప్రయాణికులతో మినీ బస్సు రంబన్ నుంచి బనిహల్‌కు బయలుదేరింది. ఉదయం 9.55 గంటలకు జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతుండగా మారూఫ్ సమీపంలోని కేళా మోల్ వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడింది. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పది మందిని హెలికాప్టర్లలో ఉదంపూర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరిని జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఆరు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్, మరో ప్రైవేట్ హెలికాప్టర్ సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. -
నదిలో పడిన బస్సు : నలుగురు గల్లంతు
బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ ప్రయాణికుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కాపాడి...సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని మీడియా పేర్కొంది. -
మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ బస్తీలో ఓ మినీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. 108 క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అదే ప్రమాదంలో నాలుగు కార్లు, 5 బైకులు ధ్వంసమైనాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి... మినీ వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.