లోయలో పడిన బస్సు.. 35 మంది మృతి | 35 Killed As Mini Bus Falls Into Gorge In Jammu kashmir | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు.. 35 మంది మృతి

Published Tue, Jul 2 2019 3:28 AM | Last Updated on Tue, Jul 2 2019 10:19 AM

35 Killed As Mini Bus Falls Into Gorge In Jammu kashmir - Sakshi

మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు, సంబంధీకులు

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని కిస్తవర్‌ జిల్లాలో సోమవారం ఓ మినీబస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారని సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీసు శక్తి పాతక్‌ తెలిపారు. మరణించిన 35 మందిలో 13 మంది మహిళలే. వారిలో 45 రోజుల పసికందుతోపాటు ముగ్గురు టీనేజర్లు సాజన్‌ శర్మ (18), వసీమ్‌ రాజా (18), షజియా (19)లు ఉన్నారు. కేష్వాన్‌ నుంచి కిస్తవర్‌ వెళుతున్న బస్సు సోమవారం ఉదయం 7:30 గంటలకు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ లోయలోకి పడిపోయింది. బస్సు సామర్థ్యం 28 కాగా, అందులో 52 మంది ఉన్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఏఎస్‌ రాణా తెలిపారు. పోలీసులు, రక్షణ బలగాలు, స్థానికులు కలసి బస్సులోని వారిని బయటకు తీశారు. ఎంఐ–17 హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఆస్పత్రికి తరలించారు. అందులో తొమ్మిది మందికి జమ్మూ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విచారం వ్యక్తం చేసిన నేతలు..
ప్రమాదంపై జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యప్రకాశ్‌ మాలిక్‌ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో 32 మంది మృతి చెందడం హృదయ విదారకమని ప్రధాని మోదీ అన్నారు. మృతిచెందిన వారి కోసం దేశమంతా రోదిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రోడ్డు ప్రమాద వార్త వినగానే విచారానికి లోనయ్యానని అన్నారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరితోపాటు ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, గులాం నబీ ఆజాద్, గులామ్‌ అహ్మద్‌ మిర్, ఎంవై తరిగమిలు కూడా ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రవీందర్‌ రైనా మాట్లాడుతూ పర్వత ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ గురించి ఈ ప్రమాదం ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు.

ఇనుప కంచెలు నిర్మించాలి: ఐఆర్‌ఎఫ్‌
సురక్షిత రోడ్డు ప్రయాణం కోసం కృషి చేస్తున్న జెనీవాలోని ఇంటర్నేషనల్‌ రోడ్‌ ఫెడరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) సంస్థ ఈ ప్రమాదంపై స్పందించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. పర్వత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని  ప్రభుత్వాన్ని కోరింది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని ఐఆర్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ ఎమిరిటస్‌ కేకే కపిల అన్నారు. వాహనాల్లో జీపీఎస్‌ను అమర్చడంతో పాటుగా లోయ ఉన్న వైపు దృఢమైన ఇనుప కంచె నిర్మించాలన్నారు. భారత్‌లో 2017లో రోడ్డు ప్రమాదాల్లో 1.46 లక్షల మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement