రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందే..
* శంషాబాద్ విమానాశ్రయానికి తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
* ఢిల్లీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు పన్ను కడుతున్నట్లు స్పష్టీకరణ
* ఆస్తి పన్ను పరిధిలోకి రావన్న జీఎంఆర్ అభ్యర్థనల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ యాజమాన్యం ‘జీఎంఆర్’కు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అవసరాలకు వినియోగించే ‘రన్ వే’తో పాటు ఎయిర్‌పోర్ట్‌లో వాహనాల పార్కింగ్‌కు వినియోగించే ‘ట్యాక్సీ వే’లు సైతం ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం దేశంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్‌లు స్థానిక విమానాశ్రయాలపై విధిస్తున్న రన్‌వే, ట్యాక్సీ వేకు సంబంధించిన ఆస్తి పన్నుల సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ వివరాలను శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యానికి తెలియజేస్తూ.. పన్నులు చెల్లించాల్సిందేనని కోరింది.
వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆస్తుల జాబితాలో విమానాశ్రయాల రన్‌వేలు, ట్యాక్సీవేలు లేవు. అయినా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వసూలు చేస్తుండడంపై గతంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విమానాశ్రయ యాజమాన్యం వీటిపై ఆస్తి పన్ను చెల్లించడం ఆపేసింది. పన్ను విధింపుపై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రన్‌వేలు, ట్యాక్సీవేలపై దేశవ్యాప్తంగా ఆస్తి పన్ను విధిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నగరంలోని బేగంపేట విమానాశ్రయాలకు లేఖలు రాసి రన్‌వేలు, ట్యాక్సీవేలపై ఆస్తి పన్ను విధిస్తున్నట్లు సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యం సైతం ఆస్తి పన్ను కట్టాల్సిందేనని కమిటీ తేల్చిచెపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
త్వరలో ప్రత్యేక రేటు ఖరారు
శంషాబాద్ విమానాశ్రయ పరిధిని ప్రభుత్వం ‘నోటిఫైడ్ ఏరియా కమిటీ’గా ప్రకటించడంతో పాటు ఓ మున్సిపల్ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ కమిటీ విమానాశ్రయ యాజమాన్యం నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తుంది. రన్‌వే, ట్యాక్సీవే మినహా ఇతర ఆస్తులపై జీఎంఆర్ పన్నులు చెల్లిస్తోంది. తాజాగా రన్‌వే, ట్యాక్సీవేపై సైతం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ప్రత్యేక రేటును త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది.