స్పెషలిస్టులొచ్చేనా?  | Telangana Medical health Department Replacement Of Specialist Medical Posts | Sakshi
Sakshi News home page

స్పెషలిస్టులొచ్చేనా? 

Published Sat, Apr 16 2022 3:27 AM | Last Updated on Sat, Apr 16 2022 2:56 PM

Telangana Medical health Department Replacement Of Specialist Medical Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో స్పెషలిస్ట్‌ వైద్య పోస్టుల భర్తీ ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎం, పారామెడికల్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులున్నాయి. డాక్టర్‌ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్‌ వైద్య పోస్టుల భర్తీ ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది అనుమానంగా మారింది. పారామెడికల్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ భర్తీ చేయనుంది.

అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్‌ తదితర స్పెషలిస్ట్‌ పోస్టులున్నాయి. అయితే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినా ఏ మేరకు స్పెషలిస్టులు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖలో అనుమానాలున్నాయి. నోటిఫికేషన్ల కంటే ముందు ఇప్పుడు అధికారులను ఇదే వేధిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు.  

2018 నాటి చేదు అనుభవం... 
2018లో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్‌ వైద్యులకు పోస్టింగ్‌లిచ్చారు. అన్నీ పోస్టులను భర్తీ చేశారు. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌ నగరంలోని ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి. అందులో దాదాపు 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు.

మిగిలినవారు చేరకుండా ఉద్యోగాలను వదులుకున్నారు. చేరిన వారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. వీరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కొందరిని తీసేశారు. సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్యకు కారణమని తెలుస్తోంది. స్పెషలిస్ట్‌ వైద్యులకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

తక్కువ వేతనాలకు జిల్లాల్లో పనిచేయాల్సిన అవసరమేంటన్న భావన ఉంటోంది. పైగా ఇప్పుడు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నందున ఏ మేరకు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సదరు శాఖ స్పెషలిస్ట్‌ వైద్యుల భర్తీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.  

ఏఎన్‌ఎం పోస్టులకు భారీ డిమాండ్‌.. 
ఎంబీబీఎస్‌ అర్హతతో భర్తీ చేసే మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఏఎన్‌ఎం పోస్టులకు ఈసారి భారీగానే డిమాండ్‌ ఉంటుందని వైద్య వర్గాలు అంచనా వేశాయి. 1,785 ఏఎన్‌ఎం పోస్టులకు దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎంబీబీఎస్‌ అర్హతతో భర్తీ చేసే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 1,100పైగా ఉంటాయని, వాటికి దాదాపు ఐదారు వేల మంది నుంచి పోటీ ఉంటుందని అంటున్నారు.

4,600కు పైగా ఉన్న స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు కూడా రెండుమూడు రెట్లు పోటీ ఉంటుందని భావిస్తున్నారు. డాక్టర్‌ పోస్టులు మినహా మిగిలిన వాటికి రాత పరీక్ష ఉండే అవకాశముంది. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడటానికి నెల రోజుల సమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆ తర్వాత రెండుమూడు నెలల ప్రక్రియ పడుతుందని ఆయన పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement