మంచి మనసులు | Tata Sherwood Residential Society for Children's education | Sakshi
Sakshi News home page

మంచి మనసులు

Published Sat, Sep 10 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

మంచి మనసులు

మంచి మనసులు

ఆదర్శం
‘చిన్న పని చేయడానికైనా సరే...గొప్ప మనసుండాలి’ అంటారు. బెంగళూరులోని ‘టాటా షేర్‌వుడ్ రెసిడెన్షియల్ సొసైటీ’ వాసులు తమ ఇండ్లలో పనిచేసే వారి పిల్లల చదువు నుంచి మొదలు ఆరోగ్యం వరకు రకరకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు.  మామూలుగానైతే... పని వాళ్లు రావడం, తమ పనేదో చేసుకొని పోవడం వరకే ఉంటుంది. అయితే ఈ  రెసిడెన్సీవాసులు మాత్రం తమ వంటవాళ్లు, డ్రైవర్లు, క్లీనర్లు... ఇతర పనివాళ్ల  పిల్లలకు ట్యూషన్ పాఠాలు చెప్పడం నుంచి మొదలు స్కూలు ఫీజులు కట్టడం వరకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం...
 
దీపావళికి రెండు రోజుల ముందు ఈ రెసిడెన్సీలో వంట పని చేసే మహిళ ఒకరు జబ్బున పడ్డారు. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమైన సొమ్ము... నాలుగు లక్షలు! రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబానికి ఆ మొత్తం కలలోని మాట.
 
వారి బాధ మాటలకు అందనిది.
 ఏంచేయాలో తోచక ఇంటిల్లిపాది కన్నీరు మున్నీరయ్యారు.
 ఆ నోటా ఈ నోటా పడి  విషయం సొసైటీవాసులకు తెలిసింది.
 తమ కుటుంబసభ్యులకో, బంధువులకో సమస్య వచ్చినప్పుడు ఎంత సీరియస్‌గా, సిన్సియర్‌గా స్పందిస్తారో అదే స్థాయిలో స్పందించారు.
 సానుభూతి చూపడానికి మాత్రమే పరిమితమై పోలేదు. కార్యాచరణ గురించి ఆలోచించారు. పరిస్థితిని వివరిస్తూ సొసైటీ గూగుల్ గ్రూప్‌లో ఇ-మెయిల్ పెట్టారు.
 మంచి స్పందన కనిపించింది.
 
నాలుగు రోజుల్లోనే మూడు లక్షల రూపాయలు వసూలయ్యాయి.
 రెసిడెన్సీవాసులు మాత్రమే కాదు... వారి బంధువులు, పరిచయస్థులు కూడా తమ వంతుగా సహాయం చేశారు. అలా... సహాయ నిధి... నాలుగున్నర లక్షలకు చేరింది.
 సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. త్వరలోనే ఆ వంటమనిషి కోలుకుంది. ఈ సంఘటన  రెసిడెన్సీ వాసుల మనసుల్లో సంతోషాన్ని నింపింది. ఒక మంచి పనిచేశామనే భావన వారిలో కనిపించింది. ‘మంచి పని’లోని గొప్పదనం ఏమిటంటే అది మరిన్ని మంచి పనులకు దారి చూపుతుంది. పేద వంటమనిషికి చేసిన సహాయం కూడా మరిన్ని మంచి పనులకు దారి చూపింది.

వంట మనిషి కోసం సేకరించిన డబ్బులో మిగిలిన మొత్తాన్ని ఎలా ఉపయోగించాలనేదాని గురించి రెసిడెన్సీవాసులు ఒక సమావేశం నిర్వహించుకున్నారు.
 అనేక రకాలుగా ఆలోచించిన తరువాత... ఆ మొత్తాన్ని రెసిడెన్సీలో పని చేసే వారి పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వాలంటరీ గ్రూప్‌గా ఏర్పడి మరిన్ని మంచి పనులు చేయాలనుకున్నారు.

 ఒక ప్రణాళిక తయారు చేసిన తరువాత... తమ దగ్గర ఉన్న మొత్తానికి మరి కొంత మొత్తాన్ని సేకరించి పనివారి పిల్లల బడి ఫీజు కట్టాలనుకున్నారు.
 అలా మరో అడుగు పడింది.
 మొదటి సంవత్సరంలోనే నలభై మంది పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. ‘‘మనం చేస్తున్న పని మంచిదే అయినప్పటికీ... ఇది మాత్రమే సరిపోతుందా? డబ్బులు ఇచ్చి మాత్రమే తృప్తి పడుతున్నామా? స్కూలు ఫీజు గురించే మాత్రమే కాదు వారి చదువుల బాగోగులు గురించి కూడా పట్టించుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు ఒక వాలంటీర్.
 
‘ఇంకా ఏదైనా చేయాలి’ అని గ్రూప్ సభ్యులు ఎప్పుడైతే అనుకున్నారు మరో మంచి పనికి అడుగు ముందు పడింది.
 పేరెంట్స్‌ను కలిసి వారి అవసరాలేమిటో తెలుసుకున్నారు.
 పిల్లలు చదువులో ఎలా ఉన్నారో పరీక్షించారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు.
 ‘‘బోధనతో మాకెవరికీ పెద్దగా  పరిచయం లేదు. అయితే మాలోని   ఆసక్తే మమ్మల్ని ఆ దిశగా ప్రేరేపించింది. చదువు అంటే పిల్లలకు భయం స్థానంలో  ఇష్టాన్ని పెంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. స్కూలు పుస్తకాలతో సంబంధం లేకుండా కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే మా ఉత్సాహం రెట్టింపవుతుంది’’ అంటున్నారు ఒక ఆర్గనైజర్.
 ‘టాటా షేర్‌వుడ్ రెసిడెన్సియల్ సొసైటీ’లోని వాలంటరీ గ్రూప్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే... సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement