వెంకటనారాయణ. ఈయన నగరంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఈయన వేతనంలో నెలకు అన్ని కోతలు పోను రూ.30 వేలు చేతికి వస్తుంది. ప్రతినెలా 1వ తేదీ వస్తే.. జీతం వస్తుందని సంతోషపడతారు.. కానీ జూన్ నెల ప్రారంభమైతే మాత్రం అమ్మో జూన్ నెల వచ్చిందా.. అని ఉలిక్కిపడతారు. కారణం.. పాఠశాలలు ప్రారంభం కావడంతో పాటు పెరిగిన ఖర్చులతో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
వైఎస్సార్ జిల్లా: విద్యా సంవత్సరం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఇంట కొనుగోళ్ల సందడి ప్రారంభమైంది. పాఠశాలలు జూన్ రెండో వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్లే చిన్నారుల కోసం రెండు జతల బూట్లు, సాక్సులు, టై, రెండు జతల యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్, అరైజర్స్ ఇలా ఒక్కటేమిటి పాఠశాలకు సంబంధించిన మొత్తం సామగ్రి కొనుగోలు చేయాలంటే కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయలు అవసరమవుతాయి.
ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో చదువుతున్నా కనీసం రూ.40 నుంచి 60వేలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇక హైస్కూల్, కళాశాల స్థాయిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీటితో పాటు నెలవారి అద్దె, పాలు, ఇంటిసరుకులు, కరెంటు బిల్లు, డిష్‌బిల్లు, కూరగాయలకు సంబంధిం చిన ఖర్చులు ఉండనే ఉన్నాయి.
నిప్పులు కురిపిస్తున్న నిత్యావసర ధరలు..
నిత్యావసర ధరలు రోజురోజుకీ కొండెక్కుతున్నాయి. కంది పప్పు కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కూరగాయల ధరలు సైతం వెక్కిరిస్తుండటంతో సామాన్యుడి పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారైంది.
అప్పులు చేయక తప్పడం లేదు...
జూన్ నెల వచ్చిందంటే మాకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు పుస్తకాలు, నోటు బుక్కు లు కొనేందుకు, దుస్తులు కొనేందుకు చాలా ఇబ్బం దులు పడుతున్నాం. దీనికి తోడు మాకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా రెండు నెలలుగా ఇవ్వకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. - ఆరోగ్యమ్మ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి
జూన్ నెల వచ్చిందంటే తిప్పలు తప్పడం లేదు...
జూన్ నెల ప్రారంభమైందంటే.. పిల్లల అడ్మిషన్లు, యూనిఫాం, షూ ఇలా ఒకటేమిటి అన్నింటా హడావుడి మొదలవుతుంది. దీనికితోడు నెలవారి ఖర్చులతో పాటు కనీసం మరో రూ.50వేలు ఫీజులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికి హద్దు ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదు. - బి. నిరంజన్‌రాజు, కోఆపరేటివ్ కాలనీ
ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు...
పాఠశాల ఫీజు: : రూ.20వేలు
యూనిఫాం (రెండు జతలు) : రూ. 2000
షూ, సాక్సులు (రెండు జతలు) : రూ. 1500
ఆటో చార్జీలు (నెలకు) : రూ. 1000
పుస్తకాలు : రూ. 6000
నోటు బుక్స్ : రూ. 3000
బ్యాగులు, బాటిళ్లు, క్యారీబాక్స్ : రూ. 1000
ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు రూ. 32,500
ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 65,000.
అమ్మో...జూన్ నెల !!
Published Thu, Jun 2 2016 9:17 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement
Advertisement