పిల్లల చదువుకు ఏం చేస్తున్నారు?
విద్యా రుణంపై ధీమా వద్దు...
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల చదువులకు ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది కదా! ఇప్పటి నుంచే దాచుకోవడం దేనికి అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ రుణాలు అన్ని కోర్సులకు, అన్ని యూనివర్సిటీలకు అందుబాటులో ఉండవనేది మొట్టమొదట గుర్తించాల్సిన విషయం. ఎంపిక చేసిన కోర్సులు, విదేశాల్లో చేసే కోర్సులకు, కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అంతేకాక ఈ రుణాలు తీసుకున్నాక 12 నెలల నుంచి 18 నెలల తర్వాత నుంచి వీటి ఈఎంఐలు మొదలవుతాయి. అంటే మీ పిల్లలు ఉద్యోగంలో చేరిన వెంటనే రుణాలు తీర్చడం మొదలు పెట్టాలి.
ఆర్థికంగా పిల్లలకు ఇది భారమే. ముందుచూపుతో వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లల చదువు కోసం తగినంత నిధిని సమకూర్చుకోవచ్చు. పిల్లల చదువుకోసం పొదుపు చేయడానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఏ చదువు చెప్పించాలనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీ? దానికెంత మొత్తం కావాలి? అనే అంశాలపై అవగాహనతో ప్లాన్ చెయ్యాలి.
పిల్లల ఇన్వెస్ట్‌మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా వంటి అనేక ఇన్వెస్ట్‌మెంట్ పథకాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మొత్తం సొమ్ము నామినీకి ఇస్తారు. దీంతో మీ ఆర్థిక లక్ష్యం మధ్యలోనే ఆగే ప్రమాదం ఉంటుంది. బీమా పథకాలైతే తల్లిదండ్రులకు బీమా రక్షణతో పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌నూ కొనసాగించొచ్చు. అనుకోని సంఘటన ఏమైనా జరిగినా మీ లక్ష్యం దెబ్బతినదు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి స్థిరమైన రాబడిని అందించేలా కొన్ని భీమా పథకాలున్నాయి. ఎంత తొందరగా ఈ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ మొత్తం పొందవచ్చు.
ఫైనాన్షియల్ బేసిక్స్ పొదుపు ఎలా..?
మనకు ప్రతి నెల జీతం వస్తుంది. వచ్చిన మొత్తం జీతాన్ని ఖర్చు చేయలేం కదా? భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఈ పొదుపు మొత్తం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఒకే మొత్తంలో జీతం రాదు. అలాగే వారి వయసు, అవసరాలు వంటి తదితర విషయాలు కూడా ఎంత మొత్తంలో పొదుపు చేయాలనే అంశాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే యుక్త వయసు ఉద్యోగి తనకు వచ్చే జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనే విషయాన్ని కింద వివరించాము.
* 23 ఏళ్ల వయసులో కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి తనకు వచ్చే జీతంలో 60-65 శాతాన్ని పొదుపు చేయాలి. ఈ విధానాన్ని ఏడేళ్లు కొనసాగించాలి.
* తర్వాతి 20 ఏళ్లు కూడా 25-30 శాతంగా పొదుపు చేస్తూ రావాలి. ఈ కాలంలో జీతం పెరుగుదలతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి పొదుపు మొత్తం తగ్గుతుంది.
* అటు తర్వాత ఖర్చులు తగ్గుతాయి కనుక 35-40 శాతం పొదుపు చేయాలి.