
ఉద్యోగం చేస్తున్నా తప్పని తిప్పలు
అనుమానాలతో క్షోభకు గురిచేస్తున్న వైనం
ఉమ్మడి మాచారెడ్డి మండలంలో పెరుగుతున్న వరకట్న వేధింపు కేసులు
మాచారెడ్డి: అందమైన దాంపత్య జీవితంలో వరకట్నం చిచ్చుపెడుతోంది. అన్యోన్యంగా సాగాల్సిన కాపురం అనుమానాలతో కలహాల కాపురంగా మారుతోంది. పెద్దల సమక్షంలో పంచాయతీలు, పోలీసులు కౌన్సెలింగ్ చేసినా దంపతులు మధ్య సఖ్యత కుదరడం లేదు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో వరకట్న వేధింపులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఏడాది కాలంలో పది వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. పలువురికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించినా మళ్లీ కొద్ది రోజులకు అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేయడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వర కట్న వేధింపులు తప్పడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నా పలువురు అనుమానాలతో వేధింపులకు గురి చేస్తుండగా, మరి కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.
ఉమ్మడి మాచారెడ్డి మండలంలో జరిగిన ఘటనలు ..
● పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడికి 2006వ సంవత్సరంలో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లాంఛనంగా 10తులాల బంగారం ఒప్పుకొని పెళ్లి సమయంలో 5తులాల బంగారం ఇచ్చి మరో 5తులాలు పదేళ్ల తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న విధంగా ఇంకో తులం బంగారం కలిపి మొత్తం 11తులాల బంగారం ముట్టజెప్పారు.గత కొన్నేళ్లుగా భర్త,అత్త అదనపు కట్నం కోసం వేధించసాగారు. అంతటితో ఆగకుండా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో వివాహం చేసుకున్నట్టు బాధితురాలు ఇటీవల ఠాణా మెట్లెక్కింది.
● మండలంలోని సోమారంపేటకు చెందిన యువతిని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ కు చెందిన యువకుడికి ఇచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు.అప్పుడు లాంఛనంగా రూ.లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారం కట్నంగా ముట్టజెప్పారు. ఓ కుమారుడు పుట్టేంత వరకు ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు.కొద్ది రోజుల తర్వాత ఆ యువతి టీచర్ ఉద్యోగం సాధించింది.అప్పటి నుంచి అనుమానాలతో వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
● పాల్వంచ మండలం ఆరెపల్లికి చెందిన యువతిని 11 ఏళ్ల క్రితం ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు.లాంఛనంగా కట్నకానుకలు అప్పజెప్పారు.ఓ కుమారుడు పుట్టాక అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు.ఒక సారి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా మార్పు రాకపోవడంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది.
కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం
వరకట్నంతో ఇతర కారణాలతో మహిళలను వేధిస్తున్న కేసులలో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. కౌన్సెలింగ్ తో పరిష్కారం కాని కేసులను కోర్టుకు పంపిస్తున్నాం.ఎవరైనా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారు.
– ఎస్.అనిల్, ఎస్సై, మాచారెడ్డి