
కొచ్చి: మగవారిపై లేనిపోని లైంగిక ఆరోపణలు చేసే మహిళల ఆటలు ఇకపై చెల్లవు. తప్పుడు లైంగిక ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించే మహిళలపై కేరళ హైకోర్టు(Kerala High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణ అబద్ధమని తేలితే వారిపై చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. మహిళలు దాఖలు చేస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ నూరు శాతం నిజమైనవి కావని, అందుకే ఇటువంటి ఫిర్యాదులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది.
ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు స్వీకరించిన సందర్భంలో సంబంధిత అధికారులే కాదు, సదరు కోర్టులు కూడా చిక్కుల్లో పడతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన కన్నూర్‌కు చెందిన యువకునికి ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేస్తూ, జారీ చేసిన ఉత్తర్వులలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఎ. బదరుద్దీన్ ఈ విధంగా పేర్కొన్నారు.
కొందరు మహిళలు చేసే ఫిర్యాదులు అబద్ధమని తెలిసినా, వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు తటపటాయిస్తుంటారని, అటువంటి సందర్భాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అధికారుల నిర్ణయాలు సరైనవైతే కోర్టు వారి ప్రయోజనాలను కాపాడుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుడు ఫిర్యాదుల కారణంగా బాధితులకు కలిగే హానిని ఏ విధంగానూ తీర్చలేమని, అందుకే పోలీసులు దర్యాప్తు దశలోనే నిజానిజాలను నిర్థారించుకోవాలని కేరళ హైకోర్టు సూచించింది.
ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో