అత్యాచారం కేసులో.. చట్టప్రకారం వారు చెప్పేవి చెల్లవు!
లీగల్ కౌన్సెలింగ్
మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్లయి అత్తారింటికి వెళ్లింది. చిన్నమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సమస్యేమిటంటే పెద్దమ్మాయి ప్రెగ్నెంట్‌గా ఉంది. తనకు ఎవరూ తోడు లేరని, సమ్మర్ వెకేషన్‌లో మా చిన్నమ్మాయిని తన దగ్గరకు పంపించాము. మా చిన్నమ్మాయితో మా అల్లుడి ప్రవర్తన బాగా లేదని తెలిసింది. ఏదో ఒకవంకతో మా చిన్నమ్మాయిని తాకుతూ, సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలు చేస్తున్నాడట. అమ్మాయి మొదట్లో బావగారనే గౌరవంతో పట్టించుకోలేదు. కానీ అతని ప్రవర్తన మరీ ఘోరంగా తయారైందట. తన కోరిక తీర్చకపోతే అక్కను వదిలేస్తానని, తనకు పెళ్లికాకుండా చేస్తాననీ బెదిరిస్తున్నాడట. మా అమ్మాయి వెంటనే మా ఇంటికి వచ్చేసింది. మేము ఏం చేయాలి? -ఒక తల్లి, రాజమండ్రి
మీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. అల్లుడిపై సెక్సువల్ హెరాస్‌మెంట్ కింద కేసు వేయవచ్చు. కానీ అలా చేస్తే పెద్దమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? పైగా తను ప్రెగ్నెంట్ అంటున్నారు. అల్లుడిపై చర్య తీసుకోవాలంటే కూతురి భవిష్యత్తును మీరే కూలదోసినట్లవుతుంది. మీరు ఒక పని చేయండి. డెలివరీకి మీ పెద్దమ్మాయి మీ దగ్గరకి వస్తుంది కదా! అప్పుడు ఆమె భర్త ప్రవర్తన గురించి హెచ్చరించండి. కేసు వేస్తే పరిస్థితి ఏమవుతుందో విచారించండి. ఆమె తన భ భర్తకు చెప్పుకుని మార్చుకుంటారు. భార్యకు తెలిసిందని మీ అల్లుడికి బుద్ధి వస్తుంది. ఇక మీరు కూడా ఇన్‌డెరైక్టుగా మీ అల్లుడిని మందలించండి. బుద్ధిగా మసలుకుంటే మంచిదే. లేకుంటే కేసు పెట్టచ్చు. ఇక మీ చిన్నమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు కనక సగం సమస్య పరిష్కారం అయినట్లే లెక్క.
మాకు ఒక్కగానొక్క కూతురు. అత్యంత గారాబంగా పెంచాము. ఉన్నత చదువులు చదివించాము. కారులో తప్ప ఆటో కూడా ఎక్కి ఎరగదు. ఏమైందో ఏమో ఒకరోజు తనకు మూడోనెల ప్రెగ్నెన్నీ అని, ఎవరినో ప్రేమించాననీ, పరిస్థితి తన చేయిదాటి పోయిందని ఉత్తరం రాసి పెట్టి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. మా గుండె బద్దలయింది. మా వారు మంచం పట్టారు. ప్రేమ వివాహాలకు మేం వ్యతిరేకం ఏమీ కాదు. మేము తనను ఎంతగా ప్రేమించామో తనకు తెలియంది కాదు. అయినా సరే, మాకు కనీసం చూచాయగా కూడా చెప్పలేదు. ఒకరోజు ఫోన్ చేస్తే మా చుట్టాలను పంపాము. ఒక చిన్నగదిలో ఆ అబ్బాయితో కలిసి ఉంటోందట. బాబు పుట్టాడట. మరో విషయమేమిటంటే.. ఆ అబ్బాయి జీతం కనీసం మా అమ్మాయి పార్లర్ ఖర్చులకు కూడా సరిపోదు. మా అమ్మాయి మాకు కావాలి. మేము ఏం చేయాలి? - రాజ్యలక్ష్మి, గంజాం
తలిదండ్రుల మనోవేదన మాకు బాగా తెలుసు. ఇటీవల కాలంలో యువత వైవిధ్యభరితమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. అంటే తమ వాస్తవ పరిస్థితులకన్నా భిన్నమైన జీవితం. బస్‌లలో వెళ్లేవాళ్లు బెంజికారులో వెళ్లాలని అనుకుంటే, బెంజికారులో తిరిగే వాళ్లు గంజి తాగి చూడాలని కోరుకుంటున్నారు. ఒకేరకమైన జీవితమంటే బోరెత్తిపోతున్నారు. మీ పాప పరిస్థితి అలానే ఉంది. నేనైతే అది ప్రేమ అనుకోను. ఒక తొందరపాటు, ఎంథూసియాజమ్ అనుకుంటాను. ఎందుకంటే అతనికి చదువూ, హోదా, సంపాదనా ఏదీ లేదంటున్నారు. బహుశా మీ అమ్మాయికి చాలా ఆస్తి వస్తుందని ట్రాప్ చేసి ఉంటాడు. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా వాళ్లు వచ్చి మేము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం అంటారు. కొన్నాళ్లు వేచి చూడండి. ప్రస్తుతం మీ అమ్మాయి తొందరపాటులో ఉంది. త్వరలోనే తన తప్పు తెలుసుకుంటుంది. నిజంగా ఆ అబ్బాయి అంత మంచివాడైతే రాత్రింబవళ్లు కష్టపడి మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మోసగాడైతే డబ్బు తెమ్మని ఒత్తిడి తెచ్చాడు. అప్పుడెటూ మీరు ఆదరించక తప్పదు. ఆ ప్రేమ మైకం నుంచి అమ్మాయి బయటకి రాక తప్పదు. కొంతకాలం ఓపిక పట్టి చూడండి.
మేడమ్, మా అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంజినీరింగ్ ఫైనల్‌లో ఉంది. మొన్న ఒక ఫంక్షన్‌కు స్నేహితులంతా కలిసి వెళ్లారు. మేము ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాము. ఒక పెద్ద రిసార్ట్‌లో పార్టీ జరిగిందట. మా అమ్మాయి డ్రింక్‌లో ఏదో కలిపి, తోటి స్టూడెంట్ అత్యాచారం చేశాడని మా అమ్మాయి ఏడుస్తూ చెప్పింది ఇంటికొచ్చాక. మేం పోలీసు కంప్లైంట్ చేశాము. అబ్బాయి వాళ్ల నాన్న చాలా పలుకుబడి గల వ్యక్తి. అసలు మా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, తనకు ఇంతకుముందే కొందరితో సంబంధం ఉందని, కనుక రేప్‌కేస్ అవదని పోలీసులను ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. మా అమ్మాయి ఇష్టపడే ఆ అబ్బాయితో గడిపిందని ఆరోపిస్తున్నారు. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన వేరేవాళ్లు దాన్ని ఆసరాగా చేసుకొని అత్యాచారం చేయవచ్చా? అత్యాచారాలకు ఆడపిల్లల పూర్వపరిచయాలకు ముడిపెట్టవచ్చా? - ఒక తల్లి ఆవేదన
ఆడపిల్ల ఇష్టం లేకుండా, సమ్మతి లేకుండా జరిపే లైంగిక దాడిని మానభంగం అంటారు. మీ కేసులో మీ అమ్మాయి ఇంటర్‌కోర్సుకు ఇష్టపడిందని, అంటే ఆమె అనుమతి ఉందని వాళ్ల వాదన. పైగా మీ అమ్మాయికి అంతకుముందే వేరే సంబంధాలు ఉన్నాయన్నది వాళ్ల వెర్షన్. కనుక ఇది రేప్ కేసు అవదని వాళ్ల పాయింట్. ఇది చాలా తప్పు. మీ అమ్మాయిపై జరిగింది ఖచ్చితంగా లైంగిక దాడి కిందికే వస్తుంది. పైగా మీ అమ్మాయిపై మత్తుపదార్థాలను ప్రయోగించారంటున్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 53 ఎ ని ప్రవేశపెట్టారు. అత్యాచార కేసులో అమ్మాయిల పూర్వపరిచయాలు, పూర్వలైంగిక ప్రవర్తనలు, పూర్వ సంబంధాలు పరిగణనలోకి తీసుకోరాదని, ఒక అమ్మాయికి అంతకుముందే వేరేవారితో సంబంధం ఉందని, కనుక తాము అత్యాచారం చేస్తే అది నేరం కాదని, ఆ అమ్మాయి అంగీకారంతో జరిగిందంటే కుదరదని ఎవిడెన్స్ యాక్ట్ 53 ఎ స్పష్టపరుస్తుంది కాబట్టి వారు ఎంత పలుకుబడి కలవారయినా, చట్టప్రకారం వారు చెప్పేవి చెల్లవు. మీరు ధైర్యంగా ఉండండి.
ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
ఆ బెదిరింపులకు లొంగనక్కరలేదు
కేస్ స్టడీ
మాధవి, రమేష్‌ల వివాహమై ఆరేళ్లయింది. మాధవికి మహబూబ్‌నగర్‌లో గవర్నమెంట్ ఉద్యోగం. రమేష్ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. ఆదివారం ఒకరి ప్లేస్‌కి ఒకరు వస్తూ పోతూ ఉంటారు. మాధవికి ఒక బాబు, ఇటీవలే ఒక పాప పుట్టింది. రమేష్ పాప తనకు పుట్టలేదని, మాధవికి అక్రమ సంబంధం ఉందని, ఆమె ట్రెయినింగ్ పీరియడ్‌లో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానం. ఆమెపై కక్ష పెంచుకుని, చిత్రహింసలు పెట్టసాగాడు. ఆమె ఉద్యోగం చేసే ప్రదేశానికి వచ్చి దుర్భాషలు ఆడి పోతుంటాడు. అసలు రమేష్ ఒక తాగుబోతు, పైగా వ్యసనపరుడు. ఇన్ని రోజులూ సంఘానికి భయపడి, కుటుంబ పరువు పోతుందని జంకి, పిల్లల కోసం అతన్ని భరించింది మాధవి. చివరికి అతని ప్రవర్తన ఎంతవరకూ వెళ్లిందంటే, ఆమె నగ్నచిత్రాలు తన వద్ద ఉన్నాయని, అక్రమ సంబంధాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. చాలా విచిత్రంగా, తనకు పదిలక్షలు ఇస్తే ఊరుకుంటానని, లేదంటే విడాకుల కేసు వేసి, పరువు తీస్తానంటూ భార్యను బెదిరించాడు. మాధవి బెంబేలెత్తిపోయి లాయర్‌ను సంప్రదించింది. లాయర్ ఆమెకో సలహా ఇచ్చారు.
ఆమె ఉద్యోగి, పిల్లలను పోషించుకోగలదు. ముందునుంచి కూడా రమేష్ ప్రవర్తన బాగాలేదు. సిగ్గులేకుండా భార్యనే డబ్బుకోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. డబ్బిచ్చి కాపురం నిలుపుకునే ప్రసక్తి వద్దు. ఒకవేళ విడాకులకోసం అతను కేసు వేస్తే మరీ మంచిది. చక్కగా విడాకులు తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. రోగి పాలే కోరాడు. వైద్యుడూ పాలే తాగమన్నాడు అన్నట్లుగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అతను విడాకులు అడగకపోయినా మాధవినే కేసు వేయమని సలహా ఇచ్చారు. దాంతో మాధవి ఊపిరి పీల్చుకుంది. తన బెదిరింపులకు దిగిరాకపోయేసరికి రమేష్ దెబ్బకి దారిలోకొచ్చాడు.